ఎన్ ఎండి సి ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ( ఎన్ఐఎస్ పి) ప్రాజెక్ట్ కు సంబంధించి సిబిఐ హైదరాబాద్ కు చెందిన మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ పై కేసు నమోదు చేసింది. 315 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అమలులో అవినీతికి పాల్పడ్డారు అనే అభియోగాలపై ఈ కేసు నమోదు చేశారు. మెఘా ఇంజనీరింగ్ తో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ అధికారులపై కూడా సిబిఐ కేసు నమోదు అయింది. ఛత్తీస్ గఢ్ లోని నాగార్నర్ వద్ద ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణం జరిగింది. శబరి నది నుంచి స్టీల్ ప్లాంట్ కు నీటి సరఫరా కోసం 34 కిలోమీటర్ల పైప్ లైన్ వేసే కాంట్రాక్టు ను మెఘా దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ పనుల్లో భాగంగా 174 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసినందుకు మెఘా ఇంజనీరింగ్ అధికారులకు 78 లక్ష ల రూపాయల వరకు లంచాలు ఇచ్చినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.
ఎన్నికల బాండ్స్ ద్వారా ఏకంగా 1200 కోట్ల రూపాయల మేర పార్టీ లకు చెల్లింపులు చేసిన మెఘా ఇంజనీరింగ్ ఈ మధ్య కాలంలో ప్రముఖంగా వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు బిఆర్ఎస్ తో పలు పార్టీ లకు నిధులు అందించింది. అయితే ఎక్కువ మొత్తంలో అందుకున్నది బీజేపీ, బిఆర్ ఎస్ లే. తెలంగాణ లో మెఘా ఇంజనీరింగ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా పెద్ద ఎత్తున పనులు చేయగా..ఈ సంస్థపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. మెఘా ఇంజనీరింగ్ ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ అమలు చేసినా కూడా ప్రతి చోట అవినీతి ఆరోపణలు ఎదుర్కోవాల్సిందే. గతం లో ఒక సారి మెఘా ఇంజనీరింగ్ కంపెనీపై పెద్ద ఎత్తున ఐటి దాడులు జరిగినా తర్వాత ఎలాంటి చర్యలు లేవు.