ఈ ఏడాది మే లో కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు అలా వచ్చాయో లేదో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆగమేఘాల మీద ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటి అంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై ఏ మాత్రం ఉండదు అని. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ని ఓడించి కాంగ్రెస్ పార్టీ అక్కడ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పొరుగునే ఉన్న కర్ణాటక ఫలితాల ప్రభావం ఎంతో కొంత తమకు కలిసి వస్తుంది అని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ప్రకటించుకున్నారు. అసలు కర్ణాటక ఎన్నికల ప్రభావం తమపై ఏ మాత్రం ఉండదు అన్న కేటీఆర్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి కర్ణాటక జపం చేస్తున్నారు. ఒక్క కెటిఆర్ మాత్రమే కాదు సీఎం కెసిఆర్, మరో మంత్రి హరీష్ రావు లు కూడా అదే పనిలో ఉన్నారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో ఎన్నో హామీలు ఇచ్చి వాటిని ఏ మాత్రం అమలు చేయని బిఆర్ఎస్ నేతలు..ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నిండా ఆరు నెలలు కూడా కాకముందే అసలు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమీ అమలు కావటం లేదు అంటూ ప్రచారం చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ది పొందేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు బిఆర్ఎస్ కీలక నేతల నోట తెలంగాణ కంటే కర్ణాటక పేరే ఎక్కువ వినిపిస్తుంది అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు.
ఒకప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాల ధర్నాలకు కూడా అనుమతి ఇవ్వని సర్కారు ఇప్పుడు కొంత మందిని కర్ణాటక రైతుల పేరుతో ధర్నాలు చేయటానికి దింపుతున్నారు. అది కూడా ఎన్నికల సమయంలో. దీని వెనక ఉన్నది బిఆర్ఎస్ నేతలే అని కాంగ్రెస్ ఎటాక్ చేస్తోంది. కొంత మంది మీడియా సాక్షిగా తమకు డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారు అని వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కొత్తగా హైదరాబాద్ లో కర్ణాటక రైతులు బహిరంగ సభ పెట్టడానికి అనుమతులు కోరుతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి ఎన్నికల సంఘం ఏ మేరకు అనుమతి ఇస్తుంది అనేది వేచిచూడాల్సిందే. మరో వైపు ఆదివారం నాడు జెడిఎస్ నేత కుమార స్వామి తో మీడియా సమావేశం పెట్టించి కాంగ్రెస్ పై విమర్శలు చేయించటం ద్వారా కూడా ఎంతో కొంత లబ్ది పొందాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది అంతా చూసి అసలు ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలా లేక..కర్ణాటక ఎన్నికలా అనే అనుమానం కలుగుతుంది అని ఒక నేత వ్యాఖ్యానించారు.