బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ లో ఎందుకంత ఫ్రస్ట్రేషన్?. పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి...ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఎన్నికల ప్రచార సభల్లో అయన చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయనే చర్చ సాగుతుంది. పదేళ్ల తన అద్భుత పాలనతో దేశంలోనే తెలంగాణ ను పలు రంగాల్లో నంబర్ వన్ గా నిలిపానని చెప్పుకుంటూ ఎన్నికల్లో గెలుపు కోసం మరీ ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఉందా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెసిఆర్ మాటలు చూసి ఎన్నికల్లో గెలుపు కోసం ఇలాంటి ప్రమాదకర పోకడలకు తెరతీయటం ఏ మాత్రం సరికాదు అని ఒక సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎలాగైనా ప్రజలను భయపెట్టి లబ్దిపొందాలి అని చూస్తున్నట్లు స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ వస్తే విద్యుత్ కోతలు ఉంటాయి...సంక్షేమం ఆగిపోతుంది వంటివి అయితే...అవి పూర్తిగా రాజకీయ కోణంలో చేసే ప్రకటనలుగా పరిగణించవచ్చు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ లో అల్లర్లు, కర్ఫ్యూలు ఉంటాయని సీఎం హోదాలో ఉండి చెప్పటం ఏ మాత్రం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. గత పదేళ్లలో అల్లరులు, కర్ఫ్యూ లు ఎప్పుడూ లేవు. అందులో అనుమానం లేదు.
కానీ ప్రభుత్వం మారితే..కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చాలు అల్లర్లు, కర్ఫ్యూలు ఉంటాయని కెసిఆర్ చెప్పటం అంటే ఇది ప్రజలకు ఎలాంటి సంకేతం పంపుతుంది అన్న చర్చ కూడా సాగుతుంది. అధికార పార్టీ గా ఉండి బిఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ఎప్పుడూ లేని రీతిలో ఫేక్ ప్రచారాలు చేసి కూడా పలు మార్లు చిక్కుల్లో పడిన విషయం తెలిసిందే. ఇందుకు ఉదాహరణ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీ కె శివ కుమార్ ఫాక్స్ కాన్ కంపెనీకి రాసినట్లు ప్రచారంలోకి ఫేక్ లేఖ తేవటం ఒకటి అయితే..బిఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి పై జరిగిన కత్తి దాడి కాంగ్రెస్ వాళ్ళే చేయించారు అని చెప్పి ప్రచారం చేయగా...ఆ తర్వాత పోలీసులు అందుకు బిన్నంగా...సంచలనం కోసమే ఈ దాడి జరిగినట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు రైతు బంధు విషయంలోనూ అదే ట్రెండ్ ను కొనసాగించారు. ఈసిఐ స్పష్టంగా మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ను ఉల్లఘించి మంత్రి హరీష్ రావు ప్రకటన చేసినందునే తాము అనుమతి ఇచ్చిన రైతు బందు ను ఆపివేస్తున్నట్లు స్పష్టంగా చెప్పినా కూడా కాంగ్రెస్ ఫిర్యాదు కారణంగానే రైతు బంధు ఆగిపోయింది అని బిఆర్ఎస్ అగ్రనేతలు అందరూ ప్రచారం చేశారు. మరి ఈ నెగిటివ్ ప్రచారం బిఆర్ఎస్ కొంపముంచుతుందా..మేలు చేస్తుందా తేలాలంటే డిసెంబర్ మూడు వరకు ఆగాల్సిందే. ఎన్నికల ప్రచార సభలో సీఎం కెసిఆర్ చేసిన వ్యాఖ్యలకు సంబధించి పైన ఉన్న ఆంధ్ర జ్యోతి పేపర్ క్లిప్పింగ్ లో చూడొచ్చు.