కెసిఆర్ మాటల మర్మం ఏమిటో!ఏ ఎన్నికల సభలో అయినా బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ నోటా ఒకటే మాట వస్తోంది. అది ఏంటి అంటే ఎన్నికల్లో గెలవాల్సింది పార్టీ లు కాదు...ప్రజలు అంటూ పదే పదే చెప్పుకుంటూ వస్తున్నారు. దేశం లో ఇంకా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణితి రాలేదు అని కూడా అయన ప్రతి మీటింగ్ లో ప్రస్తావిస్తున్నారు. అంటే కెసిఆర్ ప్రజలకు ఏమి చెప్పదలచుకున్నారు...బిఆర్ఎస్ గెలిచిన రెండు టర్మ్ ల్లో ప్రజలు ఓడిపోయారు అన్నది కెసిఆర్ భావమా?. అసలు ప్రజలు గెలవాలి అనే మాటల అర్ధం ఏమిటో ఎవరికీ అంతు చిక్కటం లేదు. మరో కీలక విషయం ఏమిటి అంటే రెండు సార్లు గెలిచిన తర్వాత కూడా రావాల్సినంత ప్రజాస్వామ్య పరిణితి రాలేదు అని చెప్పటం అంటే...ఇది ప్రజలను అవమానించటమా..లేక అది ఉండి ఉంటే తాము తాము గెలిచేవాళ్ళం కాదు అని కెసిఆర్ చెప్పదల్చుకున్నారా అన్న అభిప్రాయం రావటం సహజం. ప్రజలు గెలవాలి...పార్టీ లు కాదు అనే మాట కెసిఆర్ నోట ఎన్నికల ముందు నుంచి కూడా వినిపిస్తూ ఉంది. కెసిఆర్ ఈ మాటలు కన్ఫ్యూజన్ లో ఉండి చెపుతున్నారా ..లేక ప్రజలను..ఓటర్లను కన్ఫ్యూజ్ చేయటం కోసం చెపుతున్నారా?. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీనే గెలిచింది. మరి అయన ఇప్పుడు కొత్తగా గెలవాల్సింది పార్టీ లు కాదు...ప్రజలు అంటూ పదే పదే ప్రస్తావించటం వెనక కారణం ఏమి అయి ఉంటుంది అనే చర్చ సాగుతుంది.
ఇది ఎలా చూసినా బిఆర్ఎస్ కు నష్టం చేసే మాటలే తప్ప ఏ రకంగానూ మేలు చేసేవి కావు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కెసిఆర్ ఇప్పుడు ఎన్నికల కోసం రాష్ట్రం అంతా చుట్టేస్తున్నారు కానీ...గత తొమ్మిదిన్నర సంవత్సరాల్లో అయన ప్రజలను కలిసింది లేదు అనే చెప్పొచ్చు. ప్రజలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొన్న సమయాల్లో కూడా అయన ఫార్మ్ హౌస్, ప్రగతి భవన్ దాటి బయటకు రాలేదు. అధికారంలోకి వచ్చిన తొలి టర్మ్ లోనే సీఎం కెసిఆర్ ప్రజాదర్భార్ పెడతారు అంటూ ప్రకటించారు కానీ...అది ఇప్పటివరకు వాస్తవరూపం దాల్చలేదు. మరో వైపు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అసలు సీఎం ప్రజలను కలవాల్సిన అవసరం లేదు అని..సీఎం దగ్గరకు ప్రజలు వచ్చారు అంటే రాష్ట్రంలో వ్యవస్థలు ఏవీ సరిగా పనిచేస్తున్నట్లు కాదు అని ఒక కొత్త సూత్రీకరణ వినిపిస్తూ వస్తున్నారు. మరో వైపు ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలు దొరల తెలంగాణ...ప్రజల తెలంగాణకు మధ్య అన్న స్లోగన్ అందుకున్నది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తన ఎన్నికల ప్రచార సభల్లో ఇదే అంశాన్ని పలు మార్లు ప్రస్తావించారు. ఆ పార్టీ కీలక స్లొగన్స్ లో ఇది కీలకంగా మారింది. ఒక వైపు కెసిఆర్ పార్టీ లు కాదు..గెలవాల్సింది ప్రజలు అంటూ విచిత్ర వాదన చేస్తుంటే..కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ ఎన్నికలు దొరల తెలంగాణ...ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అని చెపుతోంది. రసవత్తరంగా సాగుతున్న ఈ పోటీలో ఎవరు విజేతలుగా నిలుస్తారో డిసెంబర్ మూడున కానీ తేలదు.