విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ టూర్ ను టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ బాగానే క్యాష్ చేసుకున్నారు. టార్గెట్ మోడీగా సాగిన ఆయన ప్రసంగంలో పెద్దగా కొత్త అంశాలు ఏమీలేకపోయినా శ్రీలంక లో అదానీకి అప్పగించిన విద్యుత్ ప్రాజెక్టుపై సమాధానం చెప్పాలని మోడీని నిలదీయటం, మోడీ షావుకార్ల సేల్స్ మాన్ అంటూ కొత్త విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ప్రధాని తియ్యతియ్యటి మాటలు చెబుతారు అంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రభుత్వం అవినీతి మయం..విదేశాల్లోని ఏజెంట్లను పెట్టుకుని దోపిడీ చేస్తున్నారని..సమయం వచ్చినప్పుడు ఈ విషయాలు బహిర్గతం చేస్తామన్నారు. ఈ విషయాలు అన్నీ మామూలుగా చెప్పటం వేరు..విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్ధి యశ్వంత్ సిన్హాను పక్కన పెట్టుకుని చెప్పటం వేరు. దీంతో కెసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఖచ్చితంగా ఒక్కసారి జాతీయ ప్రాధాన్యం వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు. టార్గెట్ మోడీ సంగతి కాస్త పక్కన పెడితే టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ తనకు తాను పెద్ద పరీక్షే పెట్టుకున్నారని చెప్పొచ్చు. విపక్ష పార్టీలు తమ అభ్యర్ధిగా యశ్వంత్ సిన్హాను ఖరారు చేసే సమావేశానికి టీఆర్ఎస్ నేతలు ఎవరూ హాజరు కాలేదు. ఆ తర్వాత యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరారని.అందుకు కెసీఆర్ ఓకే అన్నారంటూ ప్రకటన చేశారు. అంతే కానీ..తొలుత అధికారికంగా ఎక్కడా కూడా యశ్వంత్ సిన్హాకు మద్దతుపై ప్రకటన చేయలేదు టీఆర్ఎస్. తర్వాత మాత్రం ఆయన నామినేషన్ కార్యక్రమానికి మంత్రి కెటీఆర్ హాజరయ్యారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్న తరుణంలో యశ్వంత్ సిన్హాను హైదరాబాద్ కు ఆహ్వానించారు.
ఈ వేదికను కెసీఆర్ బాగానే క్యాష్ చేసుకున్నారు. అయితే ఇక్కడ కీలక అంశం ఉంది. రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా గెలుస్తారని ధీమా వ్యక్తం చేసిన కెసీఆర్...దేశంలోని ఎంపీలందరూ ఆత్మప్రభోధానుసారం యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాలని కోరారు. అసలు ఎవరు అయితే యశ్వంత్ సిన్హా పేరును తెరపైకి తీసుకొచ్చారో వారు కూడా ఈ పిలుపు ఇవ్వలేదు. కానీ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన కెసీఆర్ మాత్రం ఆత్మప్రభోధానుసారం ఆయనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఇది జరిగే పని కాదని చాలా మందికి తెలుసు. ఎక్కడి వరకో ఎందుకు..పక్కనే ఉన్న ఏపీలో కూడా వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా సీఎం కెసీఆర్ కు పిలుపునకు స్పందించరనే విషయం తెలిసిందే. ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని పిలుపునివ్వటం ద్వారా యశ్వంత్ సిన్హా కంటే కెసీఆరే పెద్ద పరీక్ష పెట్టుకున్నారనే వ్యాఖ్యలు విన్పిస్తాయి. కెసీఆర్ తమకున్న ఎమ్మెల్యేలు..ఎంపీల ఓట్లు వేయించి ఊరుకుంటే ఒకలా ఉండేదని..అలా కాకుండా యశ్వంత్ సిన్హా ను అసలు తామే తెరపైకి తెచ్చామనే తరహాలో కలరింగ్ ఇవ్వటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుందని ఓ నేత వ్యాఖ్యానించారు. ఇందులో విజయం సాధించటం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే యశ్వంత్ సిన్హాకు ఎందుకు ఓటు వేయాలో వివరిస్తూ ప్రధాని మోడీ దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని..ఆయనొక్కరే మేధావిగా..పర్మినెంట్ ప్రధానిగా భావిస్తున్నారంటూ మండిపడ్డారు.