కెసిఆర్ సభలకు లేని కరోనా..రిపబ్లిక్ డే కి వచ్చిందా?

Update: 2023-01-25 11:41 GMT

తెలంగాణ సీఎం కెసిఆర్ కు ఇంత కంటే అవమానం మరొకటి ఉంటుందా?. హై కోర్ట్ ఆదేశించిన తర్వాత కానీ తెలంగాణ ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి. సీఎం కెసిఆర్ కు తెలంగాణ గవర్నర్ తమిళ్ సై తో రాజకీయంగా గొడవ ఉంటే గణతంత్ర దినోత్సవాలను కేవలం రాజభవన్ కు పరిమితం చేస్తారా. పైగా అక్కడ కూడా ఏర్పాట్లు చేసేది ప్రభుత్వమే అనే సమర్ధింపు. ఇదే ప్రభుత్వం అటు బీజేపీ తో ..గవర్నర్ తో గొడవలు లేనప్పుడు రిపబ్లిక్ డే వేడుకలను అట్టహాసంగా చేసిన రోజులు ఉన్నాయి.. అంతే కాదు ఒక్క తెలంగాణాలో తప్ప దేశం లో ఏ రాష్ట్రంలో కూడా..ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా చేయరని ఒక సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. పొరుగున ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గత ఏడాది..ఈ సారి కూడా ఎప్పటిలాగానే వేడుకలు చేస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఇదే అంశంపై నగరానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి హై కోర్ట్ ను ఆశ్రయించటం...దీనిపై హై కోర్ట్ ఆర్డర్ ఇవ్వటంతో తెలంగాణ ప్రభుత్వం తో పాటు సీఎం కెసిఆర్ పరువు కూడా దారుణంగా పోయింది అని అయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వివాదాలు ఎలా ఉన్న కూడా జనవరి 26 న నిర్వయించే కార్యక్రమం విషయంలో స్వయంగా ఒక ప్రభుత్వం ఇలా చేయటం బహుశా దేశంలోనే మొదటిసారి అయి ఉండొచ్చు అని అన్నారు.

                           చివరకు హై కోర్ట్ చెపితే కానీ రిపబ్లిక్ డే వేడుకలు ఎప్పటిలాగా చేయటానికి సిద్దపడ లేదు అంటే ఇది దారుణమైన విషయం అనే చర్చ సాగుతోంది. పైగా ప్రభుత్వం దీనికి కరోనా కారణంగా చూపటంతో హై కోర్ట్ కూడా అవాక్కు అవ్వాల్సిన పరిస్థితి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం వంటి అంశాలపై పెద్ద పెద్ద ప్రసంగాలు చేసే నేతలు రిపబ్లిక్ డే వేడుకల విషయంలో ఇలా వ్యవహరించటం దారుణం అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశంపై ఈ హైకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గణతంత్ర వేడుకలు అధికారికంగా నిర్వహించాలని పేర్కొంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. పెరేడ్ తో పాటు ఎప్పటిలాగానే వేడుకలు చేయాలనీ ..కేంద్రం ఈ విషయంలో ఇచ్చిన మార్గదర్శకాలు పాటించాలని ఆదేశించింది. ఒక పక్క కెసిఆర్ తన బిఆర్ఎస్ మీటింగులు పెట్టుకుంటూ రిపబ్లిక్ డేకు మాత్రం కరోనా సాకు చూపించటం ప్రజలకు దారుణమైన తప్పుడు సంకేతాలు పంపుతుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే సీఎం కెసిఆర్ గురువారం నాడు జరిగే ఈ వేడుకలకు హాజరు అవుతారా లేదా అన్న అంశంపై కూడా రకరకాల చర్చలు సాగుతున్నాయి.

Tags:    

Similar News