కాంగ్రెస్ అధిష్టానం సత్వరమే అమల్లోకి వచ్చేలా తెలంగాణకు రాజకీయ వ్యవహరాల కమిటీని నియమించింది. ఈ కమిటీకి ఏఐసీసీ వ్యవహరాల ఇన్ ఛార్జి మాణిక్యం ఠాకూర్ ఛైర్మన్ గా వ్యవహరిస్తారు. ఇందులో పీసీసీ ప్రిసిడెంట్ రేవంత్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, వి. హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కె. జానారెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మొహమ్మద్ షబ్బీర్ అలీ, టి. జీవన్ రెడ్డి, రేణుకా చౌదరి, పి. బలరామ్ నాయక్, కొమటిరెడ్డి వెంకటరెడ్డి, డి. శ్రీధర్ బాబు, పొడెం వీరయ్య, అనసూయ(సీతక్క), కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లను నియమించారు. వీరితో పాటు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, తెలంగాణలో ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు, తెలంగాణ కు ఇన్ ఛార్జులుగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శులు ఇందులో సభ్యులుగా ఉంటారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె సి వేణుగోపాల్ జారీ చేసిన ప్రకటనలో తెలిపారు.
రాజకీయ అంశాలపై మరింత సమగ్రంగా చర్చించి నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఈ కమిటీ ఏర్పాటు చేశారు. కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ పై విమర్శలు చేస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ కు కమిటీలో చోటు దక్కింది. వీరిద్దరూ ఇప్పటివరకూ పీసీసీ నిర్వహించే సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.