న్యాయమూర్తులపై విమర్శలు..సీబీఐకి కేసు

Update: 2020-10-12 15:09 GMT

ఏపీ హైకోర్టు సోమవారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. కోర్టు వెలువరించిన తీర్పులపై కొంత మంది న్యాయమూర్తులను పరుషంగా విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇది అప్పట్లో పెద్ద సంచలనంగా మారింది. చివరకు హైకోర్టులో ఈ అంశంపై పిటీషన్ దాఖలు కావటం..దీనిపై సీఐడీ విచారణ చేపట్టడం జరిగాయి. అయితే తాజాగా హైకోర్టు సీఐడీ విచారణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఎంతో వేగంగా స్పందించి చర్యలు తీసుకునే సీఐడీ జడ్జీలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని ఎందుకు రక్షించే ప్రయత్నం చేస్తోందని ప్రశ్నించారు. ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు సోమవారం నాడు సీబీఐ విచారణకు ఆదేశిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ అంశంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి..ఎనిమిది వారాల్లోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణకు సహకరించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. న్యాయమూర్తులపై దూషణకు సంబంధించి 19 మంది పేర్లతో ఫిర్యాదు చేస్తే కేవలం 9 మందిపైనే కేసులు పెట్టి..మిగిలిన నిందితులను ప్రభుత్వం ఎందుకు రక్షిస్తోందంటూ హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వం తరపున ఏజీ కూడా సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

 

Tags:    

Similar News