ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మరో కేసు వేశారు. ఈ సారి ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులను సీబీఐ, ఈడీ సరిగా దర్యాప్తు చేయడం లేదని ఆయన తన పిల్‌లో ఆయన పేర్కొన్నారు. దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలను వదిలిపెట్టాయని రఘురామ ఆరోపించారు. కేసులకు ముగింపు ఇవ్వడంలో సీబీఐ, ఈడీ విఫలమయ్యాయని ఆయన వెల్లడించారు. అన్ని అంశాలను దర్యాప్తు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని పిల్‌లో రఘురామ కోరారు.
ఇప్పటికే ఆయన సీబీఐ కోర్టులో వేసిన కేసు జూన్ 8కి వాయిదా పడింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తన వైఖరిని స్పష్టం చేయకపోవటంపై రఘురామ లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో తదుపరి విచారణ సమయానికి సీబీఐ తన వైఖరిని లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోర్టు ఆదేశించింది. అయితే జగన్ తరపు లాయర్లు మాత్రం సీఎం జగన్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిరూపించే ఆధారాలు ఒక్కటి కూడా చూపలేదని..ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం అయిన కేసు అని వాదించారు.