జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలకు ఏ మాత్రం గిట్టదు. ఇది బహిరంగ రహస్యమే. 2024 ఎన్నికల కోసం పవన్ కళ్యాణ్ మరో సారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి తో జట్టుకట్టడం ఆ పార్టీ నేతలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దీనికి ప్రధాన కారణం టీడీపీ, జనసేన కూటమి వర్క్ అవుట్ అయితే...వైసీపీ అవుట్ అయిపోతుంది. కూటమిలో బీజేపీ ఉన్నా కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఆ పార్టీ కి ఉన్న ఓట్లు పెద్ద లెక్కలోకి వచ్చేవి కావు. అందుకే టీడీపీ, జనసేన కూటమిని ఎంత డ్యామేజ్ చేయాలో అంత మేర అధికార వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం ఎప్పటినుంచో చేసుకుంటూ వచ్చింది. ఈ విషయం గ్రహించిన రెండు పార్టీ లు కూడా వైసీపీ ఒక పథకం ప్రకారం చేసుకుంటూ వచ్చిన ప్రచారాన్ని చాలా వరకు విస్మరించాయనే చెప్పాలి. ఇప్పుడు అసలు ఎన్నికల యుద్ధం స్టార్ట్ అయినందున అధికార వైసీపీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టింది. ఇక్కడ అధికార వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత బరిలో ఉన్న విషయం తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు కొడుకు, మాజీ మంత్రి నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గం కంటే పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం పైనే వైసీపీ అధినేత జగన్ ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఒక్కో మండలానికి ఒక్కో మంత్రికి బాధ్యతలు అప్పగించటంతో పాటు గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక బృందాలను దింపి గ్రౌండ్ సిద్ధం చేస్తున్నట్లు చెపుతున్నారు.
పిఠాపురం నియోజకవర్గానికి నిధుల ప్రవాహం కూడా ఒక రేంజ్ లో ఉంది అని ఒక వైసీపీ నేత ఒకరు వెల్లడించారు. గత ఎన్నికల తరహాలో ఈ సారి కూడా పవన్ కళ్యాణ్ గెలుపును అడ్డుకోవాలని వైసీపీ ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంది. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అన్ని రకాలుగా లెక్కలు వేసుకునే పిఠాపురం నియోజకవర్గాన్ని ఫైనల్ చేసుకున్నట్లు చెపుతున్నారు. టీడీపీ, జనసేన ల కూటమి లెక్కల ప్రకారం చూసుకుంటే పిఠాపురం లో పవన్ కళ్యాణ్ గెలుపు పెద్ద కష్టం కాదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. అందుకే ఎలాగైనా సరే మరో సారి పవన్ ను అసెంబ్లీలోకి రాకుండా చేయాలనే టార్గెట్ గా వైసీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే ఇవి ఏ మేరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాలు గాజువాక, భీమవరంలో పోటీ చేసి పరాజయం పాలు అయిన విషయం తెలిసిందే. అలాగే నారా లోకేష్ కూడా మంగళగిరి బరిలో నిలిచి ఓడిపోయారు. ఓటమి తర్వాత కూడా లోకేష్ గత ఐదేళ్లుగా మంగళగిరి నియోజకవర్గంపైనే ఫోకస్ పెట్టి పని చేసుకుంటూ వచ్చారు. ఇది ఇప్పుడు ఆయనకు సానుకూల అంశంగా మారగా...పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన చోట కాకుండా పిఠాపురం బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు.