రాజ్యసభలో వైసీపీ పక్ష నేత విజయసాయి రెడ్డి రాజీనామా కంటే మరో అంశం వైసీపీ నాయకులను షాక్ కు గురిచేస్తోంది. అధికారికంగా బీజేపీ, వైసీపీ ల మధ్య ఎలాంటి పొత్తు లేకపోయినా కూడా...అనధికారికంగా జగన్ కు పలు అంశాల్లో బీజేపీ అండగా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అలాగే జగన్ కూడా తాను అధికారంలో ఉండగా పలు సందర్బాల్లో బీజేపీ కి మద్దతు ఇస్తూ వచ్చారు. ఒక సారి అయితే వైజాగ్ బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీతో తనది రాజకీయాలకు అతీతమైన బంధంగా కూడా చెప్పుకున్నారు జగన్. జగన్ విదేశాల్లో ఉన్న తరుణంలో ఉరుముల్లేని పిడుగులాగా శుక్రవారం సాయంత్రం విజయ సాయిరెడ్డి రాజీనామా ప్రకటన వెలువడింది. వైసీపీ రాజీనామాతో పాటు మూడేళ్లకు పైగా ఉన్న రాజ్య సభ సభ్యత్వం కూడా వదులుకోవడానికి విజయ్ సాయి రెడ్డి సిద్ధం అయ్యారు అంటే అది ఆషామాషీగా జరిగిన వ్యవహారం ఏ మాత్రం కాదు. దీని వెనక బలమైన కారణాలు ఉండి ఉంటాయి అనే చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది.
పైగా ఈ రాజ్య సభ్యత్వం దక్కించుకోవడానికి కూడా విజయ సాయి రెడ్డి అప్పట్లో అత్యంత విలువైన వాటిని వదులుకోవాల్సి వచ్చింది అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లో ఉంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటి అంటే కావటానికి విజయ సాయి రెడ్డి వైసీపీ ఎంపీ అయినా కూడా బీజేపీ ముఖ్యుల దృష్టిలో లేకుండా ఇది జరిగే అవకాశం లేదు అనేది స్పష్టం అని చెప్పొచ్చు. ఇదే ఇప్పుడు వైసీపీ నాయకుల్లో గుబులు రేపుతున్న అంశం. ప్రధాని మోడీ తో పాటు హోమ్ మంత్రి అమిత్ షా తో కూడా విజయ సాయి రెడ్డి కి మంచి సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు విజయసాయి రెడ్డి కి ఏ మాత్రం రక్షణ గా నిలవలేదు అంటే బీజేపీ క్రమంగా వైసీపీ కి దూరం అవుతోంది అనే చర్చ సాగుతోంది. అటు మోడీ అయినా..ఇటు అమిత్ షా అయినా ఎవరినైనా అవసరం ఉన్నంత వరకే చేరదీస్తారు అని...తర్వాత అలా సింపుల్ గా పక్కన పెడతారు అని చెపుతున్నారు.
విజయసాయి రెడ్డి ప్రజల్లో పట్టున్న నాయకుడు ఏమీ కాకపోయినా కూడా జగన్ కు పలు విషయాల్లో ముఖ్యంగా ఢిల్లీ లో జగన్ తరపున అన్ని వ్యవహారాలు ఆయనే చూసుకునే వారు. పలు తెర వెనక వ్యవహారాల్లో మాస్టర్ మైండ్ విజయ సాయి రెడ్డి అనే ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. అలాంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు సడన్ గా వైసీపీ కి గుడ్ బై చెప్పి ..తాను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నట్లు ప్రకటించటంతో దీని వెనక బీజేపీ పాత్ర కూడా ఉండి ఉంటుంది అనే భయం వైసీపీ నేతలకు పట్టుకుంది. బీజేపీ ప్రమేయం లేకుండా విజయసాయిరెడ్డి ఇంతటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు అని ఆ పార్టీ నేతలు కూడా చెపుతున్నారు. రాబోయే రోజుల్లో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగానే అసలు విషయం బయటపడుతుంది.