మాజీ ఎంపీ..ఇటీవలే వైసీపీ కి గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి మళ్ళీ యాక్టివ్ రాజకీయాల్లోకి వస్తున్నారా?. ఇవే అనుమానాలు ఇప్పుడు అందరిలో తలెత్తుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఆయన రాజ్య సభ సభ్యత్వానికి రాజీనామా చేయటంతో పాటు వైసీపీ కి కూడా గుడ్ బై చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక నుంచి తనకు ఏ పార్టీ తో సంబంధము ఉండదు అని...వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం ఒక ఫార్మ్ ల్యాండ్ లో జీప్ తో ఉన్న ఫోటో ను కూడా షేర్ చేసి...తాను తన కొత్త పనిలోకి దిగినట్లు చెప్పుకున్నారు.
కానీ విజయసాయి రెడ్డి ఆదివారం నాడు అకస్మాత్తుగా హైదరాబాద్ లో ఉప రాష్ట్ర పతి జగదీప్ ధన్ కర్ కు స్వాగతం పలికారు. ఉప రాష్ట్రపతే రాజ్యసభ చైర్మన్ గా ఉంటారు అనే విషయం తెలిసిందే. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన విజయసాయి రెడ్డి ఇప్పుడు ఎందుకు ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ కు స్వాగతం పలకటానికి వచ్చారు...టీడీపీ ప్రస్తుత రాజ్య సభ్యుడు సానా సతీష్ కంటే ముందే మాజీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి కు ఉప రాష్ట్రపతి కి స్వాగతం పలికే ఛాన్స్ ఎలా దక్కింది అన్నది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం.
ఈ ఫోటో లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఇవి చూసిన వాళ్ళు ఆంతా విజయసాయిరెడ్డి రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారా..బీజేపీ లోకి వెళుతున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఆదివారం నాడు హైదరాబాద్ ఐఐటి లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతే కాదు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్, తెలంగాణా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తో కలిసి ఐఏఎఫ్ ఛాపర్ లో మెదక్ లోని ఐఐటి హైదరాబాద్ కు చేరుకున్నట్లు విజయసాయి రెడ్డి తన పేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ఇచ్చిన ప్రాధాన్యత కూడా చర్చనీయాంశగా మారింది.