జగన్ ..ఒక పని అయిపోయింది !

Update: 2025-02-24 05:34 GMT
జగన్ ..ఒక పని అయిపోయింది !
  • whatsapp icon

అసెంబ్లీ కి వచ్చామా..సంతకాలు పెట్టామా...వెళ్లిపోయామా అన్నట్లు ఉంది వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ ఎమ్మెల్యేల తీరు. సోమవారం నాడు బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చూస్తే వాళ్ళ ఎజెండా ఏంటో స్పష్టంగా వెల్లడైంది. అటు జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో కేవలం పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. సభలో ఉన్న కొద్దిసేపు కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసహనంతో కనిపించారు. మండలి లో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సా తో ఏదో చెప్పారు..ఆ తర్వాత కాసేపటికే సభ నుంచి వాక్ అవుట్ చేశారు. ఎలాగు సభకు వచ్చారు కాబట్టి ప్రతిపక్షాన్ని గుర్తించాలి...ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు కాసేపు. అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసిన తర్వాత మీడియా తో మాట్లాడిన బొత్స తాము డిమాండ్ చేసినట్లు ప్రతిపక్ష నేత హోదా అంశం తేల్చిన తర్వాతే తమ సభ్యులు అసెంబ్లీ కి హాజరు కావాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో ఇక రాబోయే రోజుల్లో వైసీపీ సభకు హాజరు అయ్యే అవకాశం లేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

                                                                                       అసెంబ్లీ లో పదో వంతు మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని...ప్రజలు ఇవ్వని హోదా తాము ఎలా ఇవ్వగలం అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తో పాటు అధికార టీడీపీ కూడా చెపుతూ వస్తోంది. కానీ జగన్ మాత్రం ఇదే డిమాండ్ పెడుతూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియా తో మాట్లాడిన జగన్ తాను మీడియా ముందు ప్రశ్నలు వేస్తే అసెంబ్లీ లో అధికార పార్టీ సమాధానం చెప్పాలి అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కు ఎంత సమయం ఇస్తే తనకు అంత సమయం ఇవ్వాలి అని.. ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు హాజరు అవ్వబోము అని చెప్పి సోమవారం కేవలం సంతకాలు పెట్టటానికి వచ్చి సభ్యత్వాలు పోకుండా చేసుకున్నారు అనే చర్చ సాగుతోంది.

Tags:    

Similar News