తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ గా మరోసారి వై వీ సుబ్బారెడ్డికే అవకాశం ఇచ్చారు. ఇటీవలే ఆయన రెండేళ్ళ పదవీ కాలం ముగియటంతో స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మరోసారి వై వీ సుబ్బారెడ్డికే ఛాన్స్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డినే కొనసాగిస్తున్నట్లు ఏపీ సర్కార్ తెలిపింది. శుక్రవారం నాడు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను జగన్ సర్కార్ ప్రకటించింది. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఈ జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా టీటీడీ విషయం గురించి ప్రస్తావించిన ఆయన.. సుబ్బారెడ్డినే మరో రెండున్నరేళ్ల పాటు కొనసాగిస్తున్నట్లు సజ్జల ప్రకటించారు.
ఇదిలా ఉంటే జోడు పదవులకు ఈసారి జగన్ సర్కార్ బ్రేక్ వేసింది. ఎమ్మెల్యేలు నిర్వహిస్తున్న కార్పొరేషన్ పోస్టుల నుంచి వారిని తప్పించి కొత్త వారికి అవకాశం కల్పించారు. శనివారం నాడు ప్రకటించిన పదవుల్లో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పోస్టులను ప్రభుత్వం కేటాయించింది. ఏపీలో జగన్ సర్కారు కొలువు దీరి రెండేళ్ళు దాటిపోవటంతో పెండింగ్ లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టారు. త్వరలోనే మంత్రివర్గపునర్ వ్యవస్థీకరణ చేపట్టాల్సి ఉంది.