మార్చి 12 . వైసీపీ ఆవిర్భావ దినోత్సవం. ఏ పార్టీ అయినా తమ పార్టీ పుట్టిన రోజు వేడుకలు పెద్దఎత్తున చేస్తుంది. అందులో అధ్యక్షుడు, పార్టీ నేతలు అందరూ పాల్గొంటారు. చిన్న చిన్న పార్టీ లు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. కానీ అదేమీ విచిత్రమో ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి బిన్నంగా ఉంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి లోనే ఉన్నా కూడా ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొనలేదు. ఎన్నికల ఏడాదిలోకి ప్రవేశిస్తున్న తరుణంలో కూడా ఈ వైఖరి సరికాదనే విమర్శలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ప్రభుత్వం తరపున సీఎం జగన్ మోహన్ రెడ్డి వాయిస్ వినిపించే సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం రోజు జండా ఆవిష్కరించి మాట్లాడారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది లోక్ సభ సభ్యులు ఉన్న పార్టీ అధికారంలో ఉండి కూడా ఇంత పేలవంగా ఆవిర్భావ దినోత్సవం నడపటం ...దానికి అధ్యక్షుడు కూడా రాకపోవటం వంటివి ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతాయి అన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. ఒక వైపు విపక్షాలు అన్ని సజ్జలను ఇప్పటికే సకల శాఖా మంత్రి అంటూ విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు పార్టీ అంతా కూడా సజ్జల చేతుల్లోనే ఉండి అనే సంకేతాలు వెళతాయని చెపుతున్నారు. సజ్జల తీరుపై ఇప్పటికే వైసీపీలో సీనియర్ నేతలు చాలా మంది గుర్రుగా ఉన్నట్లు ప్రచారం ఆ పార్టీ నేతల్లోనే ఉంది. అయితే ఇది అంతా జగన్ కనుసన్నల్లోనే సాగుతుంది కనుక ఎవరు బయటకు మాట్లాడం లేదు.
ఇది ఇలా ఉంటే పార్టీ కార్యాలయంలో జండా ఎగరేశాక వైసీపీ ప్రభుత్వ విజయాలను సజ్జలే వెల్లడించారు. అయన మాటల్లో కొన్ని ముఖ్యంశాలు. ‘వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏనాటికీ ఓటమి లేదు. అన్ని ఎన్నికల్లోనూ వైయస్సార్‌సీపీదే ఘన విజయం. 12 ఏళ్లుగా ఎంతో ఆదర్శంగా పార్ఠీ కార్యకలాపాలు. సీఎం వై ఎస్ జగన్ పార్టీని అలా నడుపుతున్నారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై పోరాటాలు. అధికారంలోకి వచ్చాక నిరంతరం ప్రజలతో మమేకం. అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా జగన్‌పరిపాలన. వలంటీర్లు, సచివాలయాలు ఒక విప్లవాత్మక నిర్ణయం. ప్రజల ఇంటి గడప వద్దనే ప్రభుత్వ పరిపాలన. ప్రభుత్వ పథకాలన్నీ డోర్ డెలివరీ. పూర్తిగా పారదర్శకం. ప్రజలకు పూర్తి జవాబుదారీగా జగన్‌గారి ప్రభుత్వం అధికారం అంటే బాధ్యత, సేవ అని చాటిన సీఎం జగన్. ’ ప్రశంసలు కురిపించారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, మండలి ఛీఫ్ విప్ శ్రీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి పోతుల సునీత తదితర నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు.