వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఏమీ మారలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమి చవి చూసి ఏడాది కావస్తున్నా ఆయన ఇంకా ప్రజలను మభ్య పెట్టాలనే చూస్తున్నారు. కేవలం ఎమ్మెల్యే పదవి నిలబెట్టుకునేందుకు ఇన్ని పాట్లు పడాలా అన్న చర్చ వైసీపీ నేతల్లో కూడా సాగుతోంది. సోమవారం ఒక్క రోజు అసెంబ్లీకి ఇలా ఐదు నిమిషాలు వచ్చి...సంతకాలు పెట్టి వెళ్లి మళ్ళీ ఆ వెంటనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోము అని ప్రకటించారు. దీంతో ఇది అంతా ఎందుకో ప్రజలకు అర్ధం కాదా? అన్న చర్చ వైసీపీ నేతల్లో సాగుతోంది. మీరు ఒక్కసారి అలా కనిపించించి వెళ్ళండి మీకు ప్రతిపక్ష హోదా ఇస్తాం అని అధికార టీడీపీ చెప్పిందా లేక మరెవరు అయినా చెప్పారా?. ఎందుకు వచ్చారు...ఎందుకు వెళ్లారు.
సూపర్ సిక్స్ తో పాటు ఏ విషయంలో అయినా కూటమిని వైసీపీ సభలో ఉండి ప్రశ్నించవచ్చు..సభ బయట కూడా మాట్లాడవచ్చు. అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లి ప్రతిపక్ష హోదా విషయంలో అధికార పార్టీ వైఖరిని ప్రజలకు తేటతెల్లం చేసేందుకే ఇవాళ అసెంబ్లీకి వెళ్లాం అని చెపుతున్నారు అంటే ఈ వాదనను ప్రజలు ఏమైనా నమ్ముతారా?. పోనీ రాజకీయ పార్టీగా పూర్తిగా ఒక స్టాండ్ తీసుకుంటారా అంటే అది కూడా లేదు. శాసనమండలి మాత్రం హాజరు అవుతారు..అసెంబ్లీ కి మాత్రం హాజరు కారు. ఇదేమి లెక్కో అర్ధం కావటం లేదు అని వైసీపీ నాయకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జగన్ ఇదే వైఖరి అనుసరిస్తే రాజకీయంగా మరింత ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. అధికారం పోయినప్పటి నుంచి కూడా జగన్ పూర్తి అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోంది అనే వ్యాఖ్యలు వైసీపీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.
కూటమి ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను రాజకీయంగా ఉపయోగించుకోవాల్సింది పోయి జగన్ తన చర్యలతో పార్టీ ని మరింత ఇరకాటంలోకి నెడుతున్నారు అని వైసీపీ కి చెందిన ఒక మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. సోమవారం అసెంబ్లీ లో చోటు చేసుకున్న ఒక్క ఎపిసోడ్ చాలు జగన్ ఏ మాత్రం మార లేదు అనటానికి అని ఆయన తెలిపారు. జగన్ ఇప్పటికి మొన్నటి ఎన్నికల్లో తన తప్పులు ఏమీ లేకపోయినా కేవలం కూటమి హామీలకు ఆశపడి ఓట్లు వేశారు అనే నమ్ముతున్నారు తప్ప ...తాను అంతా గొప్పగా చేసినట్లుగానే భావిస్తున్నారు అని...ఈ వైఖరిలో మార్పు రానంత వరకు వైసీపీ లో ఉన్న నేతలకు కూడా ఇబ్బందులు తప్పవనే చర్చ ఆ పార్టీ నేతల్లో సాగుతోంది.