ప్రజల సొమ్ము అయితే ఎంతైనా పంచిపెట్టొచ్చు. సొంత సొమ్ము అయితే తల్లి...చెల్లికి కూడా ఇవ్వకూడదు. ఇది వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు. తల్లి...చెల్లికి తాను గతంలో చెప్పినట్లు వాటాలు ఇవ్వటానికి సిద్ధంగా లేను అని... ఇంతకు ముందు అంటే 2019 ఆగస్ట్ 21 న కుదిరిన అవగాహనా ఒప్పందం పక్కన పెట్టి..తన తల్లి, చెల్లికి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో బదలాయించ ప్రతిపాదించిన షేర్లు రద్దుచేయాలని కోరుతూ జగన్ మోహన్ రెడ్డి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్ సిఎల్ టి)ని ఆశ్రయించారు. ఇందుకు ఆయన తన పిటిషన్ లో ప్రస్తావించిన అంశాలు మరింత షాకింగ్ గా ఉన్నాయనే చెప్పాలి. ఈ పిటిషన్ పై ఎన్ సిఎల్ టి ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు కానీ..ఈ పిటిషన్ మాత్రం రాజకీయంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి భవిష్యత్ ను మాత్రం ప్రశ్నార్ధకం చేస్తుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎందుకంటే సీఎం గా ఉన్న ఐదేళ్ల సమయంలో జగన్ మోహన్ రెడ్డి డీబీటీ ద్వారా రెండున్న లక్షల కోట్ల రూపాయలు పంచిపెట్టారు. ఇదే అంశాన్ని మొన్నటి ఎన్నికల్లో పదే పదే ప్రచారం చేసుకున్నారు కూడా. తల్లి, చెల్లి విషయంలో జగన్ ఎన్ సి ఎల్ టి ని ఆశ్రయించిన తీరు చూస్తే జగన్ చేసింది పేదలపై ప్రేమతో కాదు..రాజకీయంగా తన పార్టీ ని పటిష్టపర్చుకోవటం...సీఎంగా తన స్థానాన్ని ముప్పై సంవత్సరాలపాటు సుస్థిరం చేసుకోవటం కోసమే అన్న విషయం బహిర్గతం అయింది అన్న చర్చ సాగుతోంది.
జగన్ తాజా పిటిషన్ విషయం బయటకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు ఏ విషయంలో అయినా జగన్ ను నమ్మటం మరింత కష్టంగా మారటం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జగన్ తో సన్నిహితంగా ఉండేవాళ్ళకు ఆయన గురించి పూర్తిగా తెలిసినా కూడా ఈ కేసు బయటకి వచ్చిన తర్వాత ప్రజల్లో జగన్ పై వ్యక్తం అయ్యే అభిప్రాయం కూడా కీలకం కానుంది. రాజకీయంగా జగన్ ఎన్ సిఎల్ టిలో వేసిన పిటిషన్ మాత్రం భారీ నష్టం చేసే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. షర్మిల తో ఎప్పటి నుంచో ఆస్థి తగాదాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చిన పిటిషన్ లోని అంశాలు చూస్తే మాత్రం ఇది నిజం అనే అభిప్రాయం కలగటం సహజం. మొన్నటి ఎన్నికల్లో వై ఎస్ షర్మిల కాంగ్రెస్ తరపున బరిలో నిలిచి జగన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఎంపీగా బరిలో నిలిచినా షర్మిలకే తల్లి వై ఎస్ విజయమ్మ కూడా మద్దతు ప్రకటించటం జగన్ కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన చెల్లితో పాటు తల్లికి కూడా గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం షేర్లు ఇచ్చేది లేదు అని చెప్పటం అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం.