ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం వైసీపీ కి పెద్ద సవాల్ గా మారబోతుంది. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకోవటంతో వైసీపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించిన జగన్ ప్రజలు గత ఎన్నికల్లో ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించినా చేసింది ఏమి లేదు. ప్రత్యేక హోదా కాదు కదా...విభజన హామీలు సాధించటంలో కూడా అయన విఫలం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తో పాటు విశాఖ స్టీల్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టి తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగానే షర్మిలను రంగంలోకి దింపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం ఇంకా నిండా మూడు నెలలు కూడా లేదు. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్ పై ఎంత మేర ప్రభావం చూపిస్తారు అన్నది వేచిచూడాల్సిందే. గతంలో అన్న కోసం పని చేసిన షర్మిల ఇప్పుడు అన్న ఓటమి కోసం రంగంలోకి దిగటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.