విజ‌య‌సాయిరెడ్డిలో 'ఆ దూకుడు ఏది?'!

Update: 2021-10-21 14:37 GMT

ఒక్క‌సారిగా అధికార వైసీపీ రాజ‌కీయంగా ఫుల్ యాక్టివ్ అయింది. ఎప్పుడూ తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబునాయుడు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ పై ఏ మాత్రం ఛాన్స్ దొరికినా విరుచుకుప‌డ‌టంలో ముందు వ‌ర‌స‌లో ఉండే వైసీపీ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌యసాయిరెడ్డి ఈ సారి ఎక్క‌డా నేరుగా సీన్ లో క‌నప‌డ‌టం లేదేంటి?. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర ఇన్ ఛార్జిగా ఉన్న ఆయ‌న ఎక్క‌డా నిర‌స‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌టం వైసీపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో సీఎం జ‌గ‌న్ కు, విజ‌యసాయిరెడ్డికి మ‌ధ్య గ్యాప్ బాగా పెరిగింద‌ని వైసీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. మంత్రుల‌తోపాటు వైసీపీ కీల‌క నేత‌లు అంద‌రూ కూడా జ‌గ‌న్ పై టీడీపీ నేత‌ల‌ విమ‌ర్శ‌ల‌కు వ్య‌తిరేకంగా ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. కానీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట్ట‌ర్ లో త‌ప్ప బ‌య‌ట ఎక్క‌డా క‌న్పించ‌లేదు. త్వ‌ర‌లో విజ‌య‌సాయిరెడ్డిని ఉత్త‌రాంధ్ర ఇన్ చార్జి ప‌ద‌వి నుంచి కూడా త‌ప్పిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌తంతో పోలిస్తే ఆయ‌న దూకుడు బాగా త‌గ్గింద‌ని..ఇది అధినేత‌తో వ‌చ్చిన గ్యాప్ కార‌ణంగానే అని చెబుతున్నారు. అయితే ట్విట్ట‌ర్ లో మాత్రం విజ‌య‌సాయిరెడ్డి ఈ అంశంపై స్పందించారు. ట్విట్ట‌ర్ లో విజ‌య‌సాయిరెడ్డి పోస్టులు...'సిఎం జగన్ హుందాతనాన్ని బలహీనతగా తీసుకోవద్దు. ప్రతి ఎన్నికల్లో చిత్తుగా ఓడారు. 2 వారాల్లో బద్వేలులో కూడా మీ బతుకేమిటో తెలిసిపోతుంది. ప్రజలు దేవుడిగా ఆరాధిస్తున్న వ్యక్తిపై దిగజారుడు భాషను ఉపయోగిస్తే తోపులైపోరు. జనం మధ్యకు వెళ్లాలి గాని పార్టీ ఆఫీసుల్లో ఏం పని?.

సంక్షేమ పాలన చూసి ఓర్వలేక అడ్రస్ గల్లంతవుతుందని విపక్షం అడ్డదారులు తొక్కుతోంది. బూతులు తిడుతూ రాజకీయం చేస్తే ప్రజలు హర్షించరు. రెచ్చగొట్టే విద్వేష రాజకీయాలకు కాలం చెల్లింది. తాడు బొంగరం లేని వారు తమాషా చేస్తారు. క్యాడర్ అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు సహజం. అవన్నీ ప్రజల మేలు కోరుతూ, వారి కేంద్రంగానే జరగాలి. కానీ వెంటిలేటర్ పై ఉన్న తెలుగుదేశం పార్టీ బూతులకు తెగబడుతుంది. ఈ బరితెగింపునకు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ప్రజలు ఓడిస్తే తిరిగి వారి విశ్వాసాన్ని చూరగొనేందుకు పోరాడాలి. వ్యవస్థల సపోర్టు ఉంది కదా అని ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటే రాజకీయంగా పుట్టగతులు ఉండవు. మతాలు, కులాలను రెచ్చగొట్టాలని చూశారు. ఇప్పుడు సీఎం గారిని అగౌవరపర్చి మంటలు పెట్టాలని చూస్తున్నారు. ఇవేవి ఎన్నికల్లో గెలిపించలేవు.' అని పేర్కొన్నారు.

Tags:    

Similar News