మరి జగన్ ఆ అవసరాన్ని అప్పనంగా ఎందుకు తీరుస్తున్నారు?.
తెరవెనక కథలు ఏమైనా ఉన్నాయా?
అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన సీఎం నిర్ణయం
'అవసరం ఉంటేనే వాళ్ళు (కేంద్రంలో ఉన్న వారు) మన మాట వింటారు. మన ఖర్మ. ఏమి చేస్తాం బిజెపికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఇదీ ఢిల్లీ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో చేసిన వ్యాఖ్యలు.' మరి ఇప్పుడు బిజెపికి జగన్ అవసరం వచ్చింది. అది కూడా అత్యంత కీలకమైన రాష్ట్రపతి ఎన్నిక విషయంలో. అవసరం ఉంటే తప్ప వాళ్ళు మన మాట వినరు అని చెప్పిన జగన్ ఇప్పుడు తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు వాడలేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎందుకు పట్టుబట్టలేదు. అంతే కాకుండా కేవలం ఆదివాసీ మహిళ అనే ఏకైక కారణంతో బిజెపి రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు భేషరతుగా ఎందుకు మద్దతు ప్రకటన చేశారు. నిజంగా వైసీపీ మద్దతు ఇవ్వకపోతే బిజెపి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇంకా చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ పార్టీకి ఏకంగా అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. 22 మంది ఎంపీల బలం ఉంది. రాజ్యసభలోనూ వైసీపీకి తొమ్మిది మంది సభ్యులు ఉన్నారు. జగనే చెప్పారు అవసరం ఉంటే తప్ప వాళ్ళు మాట వినరు అని. మరి ఈ అవసరాన్ని రాష్ట్రం కోసం ఎందుకు వాడుకోలేదు. అంటే తెరవెనక ఏమైనా జరిగాయా?. బిజెపి ఈ అవసరాన్ని తీర్చినందుకు జగన్ కు వేరే రకంగా బిజెపి ఏమైనా సాయం చేయనుందా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతుంది. నిజంగా ప్రత్యేక హోదా కాసేపు సాధ్యం కాదనే అనుకుందాం..ఇచ్చిపుచ్చుకుందాం అనే ధోరణి రాజకీయాల్లో చాలా సహజం.
మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించాలి కదా. స్వయంగా జగనే ఈ ఫార్ములా చెప్పారు కదా. మరి ఎందుకు ఇప్పుడు దీన్మి విస్మరించినట్లు అన్న చర్చ జోరుగా సాగుతోంది. అంత అలవోకగా మద్దతు ఇవ్వటానికి బిజెపి ఏమీ వైసీపీకి అధికారిక మిత్రపక్ష పార్టీ కూడా కాదు. అనధికారిక మిత్రపక్షం అన్న విమర్శలు చాలానే ఉన్నాయి. ఈ మద్దతుకు ప్రతిఫలం వేరే రకంగా ఉండబట్టే జగన్ రాష్ట్రానికి చెందిన కీలక అంశాలను విస్మరించారనే ప్రచారం జరుగుతోంది. ఎన్నికలకు ముందు మాత్రం మాకు 25 ఎంపీ సీట్లు ఇస్తే ప్రత్యేక హోదా పరుగులు పెడుతూ వస్తుందని ప్రకటించారు. ఆ మాట నమ్మి ఇచ్చారా..మరెందుకైనా ఇచ్చారా అన్న సంగతి పక్కన పెడితే వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీ సీట్లు ఇచ్చారు ఏపీ ప్రజలు. ప్రత్యేక హోదా ఏదో దయాదాక్షిణ్యాలతో ఇచ్చేది కూడా కాదు. విభజన సమయంలో ఉన్న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ సర్కారు అధికారికంగా పార్లమెంట్ లో ప్రకటన చేసింది కూడా. దీనికి బిజెపి పూర్తి మద్దతు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న తర్వాత కూడా జగన్ తాను అధికారంలోకి వస్తే చాలు హోదా వచ్చితీరుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడు మాత్రం బేరం చేసే ఛాన్స్ ఉన్నా దాన్ని దేనికి వాడారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. సంకీర్ణ భాగస్వామిగా ఉండి కూడా యూపీఏ హయాంలో డీఎంకె తమిళనాడుకు భారీ ఎత్తున మౌలికసదుపాయాల ప్రాజెక్టులు తీసుకెళ్లిందని..డీఎంకె చేసిన తరహాలో మరే పార్టీ చేయలేదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.