ఇది గతంలో జరిగింది. తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే చేశాయి. ఇదే మోడల్ ను జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే...కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు లీజ్ పేరుతో తీసుకుని ...ఏకంగా 25 చోట్ల ఎలాంటి అనుమతులు కూడా లేకుండా భవనాలను పూర్తి చేశారు. అనుమతులు లేని భవనం అంటే అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం కిందే లెక్క. జగన్ ఒక సందర్భంలో పెద్ద పెద్ద భవనాలు కడితేనే అభివృద్ధి కాదు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలకు పనికివచ్చే ప్రాజెక్ట్ లు ఏమి కట్టని జగన్ వైసీపీ పార్టీ కోసం పెద్ద పెద్ద రాజప్రాసాదం తరహా భవనాలను కట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ మీడియా లో రావటంతో అవాక్కు అవటం జనం వంతు అవుతోంది. తాడేపల్లి లో వైసీపీ కోసం నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం నాడు అధికారులు కూల్చివేశారు.
ఈ భూమి పార్టీ ఆఫీస్ కు కేటాయించటం కుదరదు అని కొంతమంది అధికారులు ఫైల్ లో రాసినా కూడా అధికార వైసీపీ బలవంతంగా తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టింది. ఈ భూమి విషయంలో ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడాలో అన్ని చేసింది గత వైసీపీ సర్కారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే మరో వైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అని ట్వీట్ చేశారు. ఒక నియంతలా తాడేపల్లి లో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ పార్టీ ఆఫీస్ ను బుల్డోజర్స్ తో కూల్చివేయించారు అంటూ ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించటం చూస్తే జగన్ పాలన ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నిర్మించిన పార్టీ కార్యాలయాలపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచిచూడాల్సిందే.