తప్పులకు యాక్షన్ లేకపోగా..ప్రమోషన్ దిశగా అడుగులు!

Update: 2024-11-28 07:20 GMT

వైసీపీ హయాంలో నిబంధలకు విరుద్ధంగా ..అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లు చేసిన అధికారులపై కూటమి సర్కారు టార్గెట్ పెట్టుకున్న విషయం తెలిసిందే. కొంత మంది విషయంలో కఠినం గా ఉంటే ..మరి కొంత మంది విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమ కురిపిస్తోంది. ఈ జాబితాలో ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ ముందు వరసలో ఉన్నారు. ఇదే టీడీపీ జగన్ హయాంలో విద్యుత్ శాఖలో అడ్డగోలుగా అక్రమాలు సాగాయని విమర్శలు గుప్పించింది. ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అదానీ-జగన్ మోహన్ రెడ్డి అవినీతి డీల్ విషయంలో కూడా విజయానంద్ కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ విషయాలు కూటమి ప్రభుత్వంలోని పెద్దలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు తెలియవా?. లేక తెలిసినా కూడా వేరే కారణాల వల్ల విజయానంద్ కు ప్రత్యేక మినహాయింపు ఇచ్చారా?.

ఒక్క అదానీ -జగన్ డీల్ మాత్రమే కాదు...జగన్ మోహన్ రెడ్డి కి చెందిన అస్మదీయ కంపెనీలకు వైసీపీ హయాంలో వేల కోట్ల రూపాయల మేర లబ్ది చేకూరేలా ప్రాజెక్టులు అప్పగించిన విషయం తెలిసిందే. జగన్ హయాంలో కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ లు తప్పు చేసినా కూడా వదిలిపెట్టకూడదు అని నిర్ణయించిన చంద్రబాబు అండ్ కో మరి జగన్ చెప్పిన వాళ్లకు వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ లు అప్పగించటంతో పాటు తెర వెనక ఎన్నో లావాదేవీలు నిర్వహించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సీనియర్ ఐఏఎస్ విషయంలో ఎందుకు ఇంత సాఫ్ట్ గా ఉంది. వైసీపీ హయాంలో జగన్ చెప్పినట్లు చేసిన విజయానంద్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కంపెనీ ల నుంచి కూటమి పెద్దలకు పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగించేలా చేశారు అనే చర్చ ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. ఈ ప్రయోజనం కూడా వేల కోట్ల రూపాయల మేర ఉండటంతో విజయానంద్ విషయంలో ఎవరు నోరు మెదపటం లేదు అని...జగన్ -అదానీ డీల్ కు సంబంధించి కూడా మీడియా లో విజయానంద్ పాత్ర పై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా కూడా అందరూ మౌనం పాటించటం వెనక ఆర్థిక ప్రయోజనాలే తప్ప మరొకటి కాదు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అయన రంగంలోకి దిగి జగన్ హయాంలో లబ్ది పొందిన కంపెనీల నుంచి భారీ ఎత్తున ప్రయోజనం కలిగించే ఏర్పాట్లు చేయటంతోనే ..ఇప్పుడు విజయానంద్ పేరు తదుపరి సిఎస్ కు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన వాళ్లపై చర్యలు తీసుకోక పోగా ... కీలక స్థానాల్లో అలాగే కొనసాగిస్తూ ఇప్పుడు ఏకంగా సిఎస్ పోస్ట్ ఇవ్వటానికి రెడీ అయ్యారు అంటే ప్రజలకు కూటమి ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు పాముపుతుందో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Similar News