దీని వెనక మతలబు ఏంటో!

Update: 2024-07-17 08:02 GMT

రాజకీయంగా ప్రస్తుతం అత్యంత బలంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకింత బలహీనంగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు టీడీపీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అటు ఆంధ్ర ప్రదేశ్ లో బలంగా ఉండటమే కాదు...కేంద్రంలోని మోడీ సర్కారు కూడా ప్రస్తుతం టీడీపీ మద్దతుపై ఆధారపడి ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కూటమిగా కలిసి పోటీ చేసినందున రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు గౌరవించుకోవడం తప్పేమి కాకపోయినా కూడా చంద్రబాబు కేంద్రంలోని బీజేపీ విషయంలో వ్యవహరిస్తున్న తీరు టీడీపీ వర్గాలను కూడా ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు దీని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అన్న చర్చ కూడా పార్టీ నేతల్లో సాగుతోంది. జులై 23 న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్ట నున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు మరో సారి ఢిల్లీ వెళ్లి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గత ఐదేళ్ల జగన్ పాలనలో తుడిచిపెట్టుకుపోయిన ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక పరిస్థితులను వివరించినట్లు చంద్రబాబు ట్వీట్ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి జగన్ పాలనలో నాశనం అయింది అని చంద్రబాబు తో పాటు కూటమి నేతలు అందరూ ఎప్పటి నుంచో విమర్శిస్తున్న విషయం తెలిసిందే.

                                                      అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత విడుదల చేసిన నాలుగు శ్వేత పత్రాల వివరాలపై కూడా అమిత్ షా తో చర్చించినట్లు స్వయంగా చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.  ఇదే ఇప్పుడు చర్చకు కారణం అయింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ కు బడ్జెట్ లో సాయం కోరటం ఓకే. కానీ చంద్రబాబు రాష్ట్రంలో విడుదల చేసిన శ్వేత పత్రాల విషయంపై కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షా తో చర్చించటం వెనక మతలబు ఏమిటి అనే చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వానికి సంబందించిన విషయాలపై ఏమైనా విచారణ కమిషన్ లు ఏర్పాటు చేసే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఈ పని చేశారా..లేక తాము ఏమి చేసినా కూడా కేంద్రం దృష్టిలో పెట్టే చేస్తున్నాం అనే సంకేతం ఇచ్చేందుకు ఈ పని చేసారా అన్న అంశంపై రాబోయే రోజుల్లో కానీ స్పష్టత వచ్చే అవకాశం లేదు. గత జగన్ సర్కారు ఆర్థిక అసమర్ధత, దారుణ నిర్వహణ వైఫల్యాలు, విచ్చలవిడి అవినీతి కారణంగా రాష్ట్రం కోలుకోలేని రీతిలో దెబ్బతిన్నది అని చంద్రబాబు పేర్కొన్నారు. అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో కూడా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తాం అని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో శ్వేత పత్రాల గురించి అమిత్ షా తో చంద్రబాబు చర్చించటం అన్నదే కీలకం మారినట్లు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News