కలెక్టర్ల సమావేశానికీ పవన్ డుమ్మా!

Update: 2025-03-25 05:39 GMT
కలెక్టర్ల సమావేశానికీ పవన్ డుమ్మా!
  • whatsapp icon

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో అంతా పవన్ కళ్యాణ్ ఇష్టమేనా?. అసెంబ్లీ కి అయినా...క్యాబినెట్ సమావేశాలకు అయినా ఆయనకు ఇష్టం అయితే వస్తారు..లేక పోతే లేదా?. ఇటీవల వరకు జరిగిన ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు అయింది అతి తక్కువ రోజులే. అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలు చూస్తున్న పవన్ కళ్యాణ్ సభకు హాజరు కాకపోవటంతో ఈ కీలక శాఖలకు సంబంధించిన ప్రశ్నలు కూడా వాయిదా వేయాల్సి వచ్చింది. అసెంబ్లీ కి డుమ్మా కొట్టిన ఆయన పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పాల్గొన్నారు. ఇటీవలే ఒక తమిళ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కానీ మంగళవారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశానికీ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టారు. ఈ సమావేశంలో చంద్రబాబు పక్కన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోసం సీటు కేటాయించినా పవన్ కళ్యాణ్ రాకపోవటంతో అది ఖాళీగా కనిపించింది. పవన్ కళ్యాణ్ రాక పోయినా ఆ సీటు ను అలాగే ఖాళీ ఉంచి పక్క సీట్ లో రెవిన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ కూర్చున్నారు. ఇతర మంత్రులతో పోలిస్తే ఉప ముఖ్యమంత్రి గా ఉన్న పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కు హాజరు అయ్యేది కూడా తక్కువే అని చెప్పొచ్చు.

                                                            ఏకంగా అసెంబ్లీ సమావేశాలకు...ఇప్పుడు కలెక్టర్ల సమావేశానికీ కూడా డుమ్మా కొట్టారు. పార్టీ వర్గాలు నడుము నొప్పి అని చెపుతున్నా ఆయన తన సొంత కార్యక్రమాలకు మాత్రం హాజరు అవుతూనే ఉన్నారు. నిజంగా నడుము నొప్పి ఉన్న వ్యక్తి అయితే పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ అంతగా ఊగిపోతూ మాట్లాడతారా అనే చర్చ కూడా సాగుతోంది. అయితే అటు సభకు..ఇటు కలెక్టర్ల సమావేశానికీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ హాజరు కాకపోయినా కూడా చంద్రబాబు నాయుడు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అనే చర్చ సాగుతోంది. ఇది ప్రజలకు ఏ మాత్రం సరైన సంకేతాలు పంపదు అనే అభిప్రాయం అధికార వర్గాల్లో కూడా ఉంది. జనసేన కు చెందిన ఇద్దరు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ లు మాత్రం కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. 

Tags:    

Similar News