వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి ఇంకా సైనికులు అవసరమా?.చేతిలో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను పెట్టుకుని ఇంకా ఒక్క మీ జగన్ ను ఎదుర్కోవటానికి తోడేళ్ళు వస్తున్నాయని ఎందుకు బీద అరుపులు అరుస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలో ఉండి కూడా 23 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్న టీడీపీ ని చూసి...అసలు గెలిచినా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన ను చూసి ఎందుకు జగన్ అంత భయపడుతున్నారు. ఏ మీటింగ్ లో చూసినా ఈ రెండు పార్టీలపైనే ఎందుకంత కసితో విమర్శలు చేస్తున్నారు. అసలు ఇందులో ఏ మాత్రమైనా లాజిక్ ఉందా?. స్వయంగా జగనే డీబీటి ద్వారా ప్రజల ఖాతాల్లోకి 2 . 10 లక్షల కోట్ల రూపాయలు జమ చేసినట్లు చెపుతున్నారు. 30 లక్షల మందికి ఇచ్చిన ఇళ్ల పట్టాల విలువను కూడా లెక్కేసుకుంటే ఇది ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల వరకు అవుతుంది అని లబ్దిదారులు అంతా తన కోసం సైనికులుగా మరి పని చేయాలని పదే పదే కోరుతున్నారు. అంటే అయన లబ్దిదారులను నమ్మటం లేదా...లేక ఉన్న 151 మంది ఎమ్మెల్యేలను నమ్మటంలేదా అనే సందేహాలు రాకమానవు. మరో వైపు చేతిలో ఒక పేపర్, ఒక టీవీ పెట్టుకుని..పరోక్షంగా కీలక చానెల్స్ ను గుప్పిట పెట్టుకుని కూడా తమకు ఏమి లేవు అని అలవోకగా మాటలు చెపుతున్న జగన్ తీరు చూసి సొంత పార్టీ నాయకులు కూడా అవాక్కు అయ్యే పరిస్థితి. బుధవారం నాడు సీఎం జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోని కొవ్వూరు లో జగనన్న విద్య దీవెన కార్యక్రమంలో ఎప్పటిలాగానే విపక్షాలపై విమర్శలు గుప్పించారు.
ఒక్క మీ జగన్ ను ఎదుర్కొనేదానికి తోడేళ్ళు ఒక్కటిగా వస్తున్నాయి అంటూ మాట్లాడారు. రాష్ట్రంలో పేదవాడు ఒక వైపు...పెత్తందారులు ఒక వైపు ఉన్నారు అని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ చేస్తారు..ఇంకా అబద్దాలు ఎక్కువ చెపుతారు అంటూ విమర్శించారు. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న వారికి దగ్గరగా ఉండాలని కోరుకుంటాయి. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయినా కూడా ఆంధ్ర ప్రదేశ్ లో ఒక్కటంటే ఒక్క చిన్న, పెద్ద పార్టీ కూడా ఇప్పటివరకు అధికార వైసీపీ కి సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు. తెర వెనక ఉండే పార్టీ ల సంగతి పక్కన పెడితే నేరుగా వైసీపీ తో కలిసే వాళ్ళు ఎవరూ లేరు. వైసీపీ కి నిజంగా ఎవరితో అంత అవసరం లేదు అనుకుంటే 151 మంది తో ఇంత బలంగా ఉండి 23 మంది ఎమ్మెల్యేలు గెలిచిన టీడీపీ, ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన ను చూసి వైసీపీ, సీఎం జగన్ ఇంతగా ఎందుకు భయపడుతున్నట్లు. అది కూడా అయన మాటల్లోనే మూడు లక్షల కోట్లు రూపాయలు పంచి కూడా. ఇది అంతా చూసినా వారికి లెక్క తేడా ఉందా...లేక జగన్ లెక్కే తప్పుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. వాలంటీర్ వ్యవస్థ తో ఎన్నో వ్యవస్థలు పెట్టుకుని జగన్ ఇంకా సైనికులు కావాలని అడుగుతున్నారు అంటే ఏదో తేడా ఉంది అనే అనుమానాలు ప్రజల్లో వచ్చే అవకాశం ఉంది అని ఒక వైసీపీ నేత అబిప్రయపడ్డారు.