ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా లిక్కర్ స్కాం వ్యవహారం దుమారం రేపుతోంది. సిట్ ప్రాధమికంగా ఇందులో 3500 కోట్ల రూపాయల మేర స్కాం జరిగినట్లు తేల్చింది. ఈ స్కాం లో వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏ 5 గా ఉన్నారు. లిక్కర్ పాలసీ తయారుతో పాటు ముడుపులు సొమ్ము బదిలీ వ్యవహారంలో కూడా ఆయన అత్యంత కీలకంగా వ్యవహరించినట్లు సిట్ తన చార్జిషీట్ లో పేర్కొంది. ఇటీవలే ఈ లిక్కర్ విధాన రూపకల్పన లో కీలకపాత్ర పోషించటంతో పాటు ముడుపులు సొమ్ములో కొంత మేర ఆయన కంపెనీలకు కూడా మళ్లాయనే అభియోగాలతో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ని సిట్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇది వైసీపీ లో ప్రకంపనలు రేపుతోంది. మరో వైపు ఈ లిక్కర్ స్కాం సొమ్ము అంతిమలబ్దిదారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని సిట్ చెపుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన లింక్ లను మరింత పక్కాగా ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాల్లో ఉంది. ఫైనల్ చార్జిషీట్ లో ఈ విషయాలు అన్ని బయటకు వస్తాయని చెపుతున్నారు. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఎన్నో అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ లో ఒక సారి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటికి చంద్రబాబు ఉంటే ఆయన సంగతి తెలుస్తామంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అయితే వెంకటేశ్వర స్వామి నగలు తవ్వుకుని చంద్రబాబు ఇంటికి తీసుకువెళ్లాడని...స్వామికి చెందిన పింక్ డైమండ్ కూడా చంద్రబాబు ఇంట్లోనే ఉంది అంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. బహుశా విజయసాయి రెడ్డి అంత దారుణంగా చంద్రబాబు ని ఎవరూ విమర్శించి ఉండరు. కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో కలకలం రేపుతున్న లిక్కర్ స్కాం లో ఒక వైపు విజయసాయి రెడ్డి విధాన రూపకల్పనలోనూ...ముడుపులు సొమ్ము రూటింగ్ లోనూ కీలక పాత్ర పోషించినట్లు సిట్ స్పష్టంగా చెపుతున్నా కూడా ఆయన్ను అరెస్ట్ నుంచి ఎవరు కాపాడుతున్నారు అనే చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది. బీజేపీ నేతలు ఆయన అరెస్ట్ ను అడ్డుకుంటున్నారా..లేక కూటమి పెద్దలే వదిలేశారా అన్న చర్చ టీడీపీ వర్గాల్లో ఉంది.
ఇది ప్రజలకు ఏ మాత్రం మంచి సంకేతం పంపదు అనే అభిప్రాయం కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లిక్కర్ స్కాం కి సంబంధించి కీలక విషయాలు ఆయనే సిట్ కు ఇచ్చారు అని...ఇది కూడా ఆయన జోలికి వెళ్లకపోవటానికి మరో కారణం అయి ఉండొచ్చు అనే అభిప్రాయం కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా మరో సారి తమ ముందు హాజరు కావాలని సిట్ నోటీసు లు జారీ చేస్తే ..విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాకపోగా..తనకు మరింత సమయం కావాలని సిట్ కు సమాచారం ఇచ్చారు. విజయసాయి రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు అనటానికి ఆయన ఇప్పుడు ఎంపీ కూడా కాదు. కానీ సిట్ ఆయనకు కోరినంత గడువు ఇస్తున్నట్లు కనిపిస్తోంది అని...ఇది ప్రజలకు తప్పు సంకేతాలు పంపుతుంది అని ఒక మంత్రి అభిప్రాయపడ్డారు . అన్నింటి కంటే విచిత్రం ఏమిటి అంటే అత్యంత కీలకమైన ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ పాలసీ ని ఒక వైపు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..మంత్రి నారాయణ స్వామి లకు సంబంధము లేకుండా ఎంపీలు ...బయటి వ్యక్తులు కలిసి రూపొందించారా అని ఆయన ప్రశ్నించారు.