ఇది కూడా కిమ్ నిర్వాకమేనా!

Update: 2024-11-19 05:54 GMT

డీల్ సెట్ అయినందునే అంతా మౌనం వహిస్తున్నారా!

ఏపీ ఐఏఎస్ వర్గాల్లో ఇదే చర్చ 

అధికారంలో ఉన్న నాయకులు భూములు కబ్జా చేయటం...బలవంతంగా తక్కువ ధరకు కొనుగోలు చేయటం వంటివి నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. కానీ ఒక ఐఏఎస్ అధికారి...అది కూడా సిఎస్ గా ఉన్న సమయంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన వైజాగ్ చుట్టుపక్కల వందల ఎకరాలు బినామీ పేర్లతో కొనుగోలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు...జనసేన వైజాగ్ కార్పొరేటర్ మూర్తి యాదవ్ అయితే పలు మార్లు మీడియా సమావేశాలు పెట్టి జవహర్ రెడ్డి మనుషులు ఎక్కడెక్కడ భూములు కొన్నారో వెల్లడించారు. ఇది అంతా కూడా ఆయన సిఎస్ గా ఉన్న కాలంలోనే సాగింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే మూర్తి యాదవ్ ఆరోపణలు తప్పు అని..ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ..లీగల్ నోటీసు లు ఇస్తామని జవహర్ రెడ్డి అధికారికంగా ప్రకటనలు అయితే ఇచ్చారు కానీ..నోటీసు మాత్రం ఇవ్వలేదు. దీంతో మాజీ సిఎస్ జవహర్ రెడ్డి తన హోదాను దుర్వినియోగం చేసి...తనకు ముందస్తుగా తెలిసిన సమాచారం ఆధారంగా బినామీల పేరుతో వందల ఎకరాల భూమి కొనుగోలు చేసినట్లు వచ్చిన వార్తలు నిజం అన్నట్లు తేలిపోయినట్లు అయింది. సిఎస్ గా ఉన్న వ్యక్తి ఎలాంటి తప్పు చేయకపోతే మూర్తి యాదవ్ కు నోటీసు ఇవ్వటానికి ఎందుకు భయపడతారు అన్న చర్చ తెరమీదకు వచ్చింది.

                                                                            ఇది అంతా పాత కథ. వైసీపీ హయాంలో సాగిన భూ దందాలపై కూటమి ప్రభుత్వం వచ్చాక సిట్ వేసి విచారణ జరుపుతుంది అని అంతా భావించారు. కానీ గతంలోనే హాట్ టాపిక్ గా మారిన జవహర్ రెడ్డి భూ దందా పై చర్యలు అలా ఉంచి ఆ వందల ఎకరాల్లో కొంత మొత్తాన్ని తమ బినామీలకు రాయించుకునేలా ఒక యువ మంత్రి నేతృత్వంలోని కిమ్ టీం ప్రయత్నాలు చేస్తోంది అని ...అందుకే గత కొన్ని నెలలుగా ఈ కేసు లో ఎలాంటి కదలిక లేదు అని చెపుతున్నారు. జవహర్ రెడ్డి విషయానికి వస్తే పక్కా ఆధారాలతో మీడియా లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు ఈ దిశగా ఎలాంటి చర్యలు లేకపోగా ...అన్నిట్లో చేస్తున్నట్లుగానే ఈ విషయంలో సెటిల్మెంట్ సాగుతున్నట్లు చెపుతున్నారు. ఈ విషయంలో పక్కా ఆధారాలు ఉన్నా కూడా కూటమి సర్కారు ఆయన్ను కాపాడే ప్రయత్నం చేస్తోంది అని...మరో వైపు మాజీ సిఎస్ కూడా తనకు కీలక మంత్రితో ఎంతో సాన్నిహిత్యం ఉన్నందున తనను ఎవరూ ఏమి చేయలేరు అని వ్యాఖ్యానించినట్లు ఐఏఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా జవహర్ రెడ్డి పై పలు ఆరోపణలు చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మౌనంగా ఉంటూ ...కారు చౌకగా కొట్టేసిన భూముల్లో వాటాల కోసం సెట్ చేసుకునే సాగుతున్న ప్రయత్నాలు చూసి అధికార వర్గాలు కూడా విస్తుపోతున్నాయి.

                                                                                              పరిస్థితి ఇంత దారుణంగా ఎందుకు మారిందో అర్ధం కావటం లేదు అని అధికార వర్గాలు షాక్ కు గురవుతున్నాయి. ఒక వైపు పార్టీ కోసం కార్యకర్తలు వైసీపీ హయాంలో పోరాటం చేస్తే..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చి పోయి జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండటంతో పాటు ఆయన కోసం పని చేసిన వాళ్ళతో సెటిల్మెంట్స్ వల్ల రాబోయే రోజుల్లో వీళ్ళను ఎవరైనా నమ్ముతారా అన్న చర్చ కూడా తెరమీదకు వస్తోంది. జగన్ మోహన్ రెడ్డి సర్కారు అసైన్ మెంట్ భూములు అమ్ముకోవటానికి వీలుగా లబ్దిదారులకు వీటిపై పూర్తి హక్కులు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఈ విషయం జవహర్ రెడ్డి కి అందరికంటే ముందే తెలిసింది.

                                                                                ఇదే అదనువుగా జగన్ సర్కారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన అత్యంత కీలకమైన విశాఖపట్నం జిల్లాలోని భూములపై కన్నేసి జవహర్ రెడ్డి తన బినామీలతో వైజాగ్ కు దగ్గరగా ఉండే ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో వందల ఎకరాలు బినామీలతో కొనుగోలు చేయించారు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ భూముల విలువ వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది అని చెపుతున్నారు. జవహర్ రెడ్డి తరపున లావాదేవీలు చేసింది ఉమేష్, త్రిలోక్ అనే వ్యక్తులు అని అప్పటిలోనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. అయినా కూటమి సర్కారు ఈ విషయంలో మౌనాన్ని ఆశ్రయిస్తుండటంతో కిమ్ బ్యాచ్ సెటిల్మెంట్ నిజం అని తేలిపోయినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 

Tags:    

Similar News