అనుభవమా ...అనుకూల అంశాలా!

Update: 2025-01-20 05:39 GMT

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో సంక్రాంతి విన్నర్ ఎవరు అనే చర్చ సాగింది. సినిమాల సందడి ముగిసింది. ఇప్పుడు దావోస్ విన్నర్ ఎవరో అనే చర్చ తెర మీదకు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా ఇప్పుడు దావోస్ లోనే ఉన్నారు. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో జనవరి 20 నుంచి 24 వరకు జరిగే సదస్సుకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరు అవుతారు అనే విషయం తెలిసిందే. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు ద్వారా ఏ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు సాధించుకొస్తారు అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం.

                                                 తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి పరిపాలనా అనుభవం తక్కువ అయినా కూడా తెలంగాణకు ఉన్న పలు సానుకూలతలు ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా చెప్పొచ్చు. ఇందులో ఒకటి హైదరాబాద్ లో ఉన్న ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాలు..అందుబాటులో ఉన్న ల్యాండ్ బ్యాంకు. మానవనరుల నైపుణ్యాలు...విస్తృత స్థాయి ఎయిర్ కనెక్టివిటీ వంటివి ఎంతో కీలకం. ఇప్పటికే పలు రంగాల్లో అభివృద్ధి అయి ఉన్న సౌకర్యాలు కూడా తెలంగాణకు అనుకూల అంశాలుగా చెప్పుకోవచ్చు. ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అనుభవం...మార్కెటింగ్ విధానాలు కీలకంగా చెప్పుకోవాలి. గతంలో కూడా చంద్రబాబు ఎన్నో సార్లు దావోస్ సదస్సుల్లో పాల్గొన్నారు.

                                                                 ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ల్యాండ్ బ్యాంకు కు కొదవలేదు. తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ కు ఉన్న సానుకూల అంశం సముద్ర తీరం...ఓడరేవులు అని చెప్పొచ్చు. ఏ రాష్ట్రానికి ఉండే అనుకూల అంశాలు ఆ రాష్ట్రానికి ఉన్నా ...పారిశ్రామిక వేత్తలు ప్రధానంగా చూసేది ఆయా రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామిక విధానాలు. ఆయా ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు...ప్రోత్సహకాలు కూడా ఎంతో కీలకం. ఇలాంటి వాటి విషయంలో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు వరసలో ఉంటారు. అయితే అటు దావోస్ లో జరిగే ఒప్పందాలు అయినా..ఇటు పారిశ్రామిక సదస్సుల్లో కుదిరే ఎంఓయూలు అయినా కూడా ఎక్కువ గా పనికొచ్చేది లెక్కలు గొప్పగా చెప్పుకోవటాని కే.

                                                                 

కొన్నిసార్లు కుదిరిన ఒప్పందాలు...వాస్తవ పెట్టుబడుల మధ్య ఎంతో తేడా ఉంటుంది అనే విషయం కూడా అందరికి తెలిసిందే. అధికారంలో ఉన్న నాయకులు దావోస్ వేదిక అయినా...మరొక అంశాన్ని అయినా తమ ఇమేజ్ పెంచుకోవటనికి..రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాం అని చెప్పుకోవటనికి వీటిని ఉప యోగించుకుంటున్నారు. తద్వారా రాజకీయ లబ్ది పొందటానికి కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మరి 2025 దావోస్ ఈవెంట్ లో అనుభవం ఉన్న చంద్రబాబు ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారా..లేక అనుకూల అంశాలు ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కువ పెట్టుబడులు సాధిస్తారా అన్నది వేచిచూడాలి. ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే తెలంగాణ తో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ టీం తో దావోస్ లో ల్యాండ్ అయింది.



Tags:    

Similar News