
ఆర్ విఆర్ ప్రాజెక్ట్స్ కు 4377 కోట్ల విలువైన ఎనిమిది పనులు
మేఘా కు ఆరు పనులు ...విలువ 5902 కోట్లు
మూడు కంపెనీలకే 29 పనులు ..వాటి విలువే 16716 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి పనులు ఈ సారి అయినా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోవాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఫస్ట్ టర్మ్ లోనే అమరావతికి సంబంధించి ఎన్నో సినిమాలు చూపించినా అవి వాస్తవరూపం దాల్చలేదు. ఈ సారి కూడా పనులు ఆశించిన స్థాయి స్పీడ్ లో జరగటం లేదు అన్నది ఎక్కువ మంది టీడీపీ ఎమ్మెల్యేల అభిప్రాయంగా ఉంది. వాస్తవానికి అంతా సిద్ధం చేసుకుని 2024 డిసెంబర్ నాటికే అమరావతి పనులు ప్రారంభించి ఉండాలి. కానీ అది జరగలేదు. ఇప్పుడు అన్ని టెండర్ల కేటాయింపు పూర్తి అయింది. ఇవి చూసిన వాళ్ళు నారాయణ ...నారాయణ. ఇదేమి లెక్క అంటూ అవాక్కు అవుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం టెండర్లు పిలిస్తే..మొత్తం 59 పనుల్లో 29 పనులు కేవలం మూడు కంపెనీలకు మాత్రమే దక్కాయంటే ఇందులో ప్రభుత్వ పెద్దల గోల్ మాల్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు అనే చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది.
ఈ పరిణామాలు చూసి మున్సిపల్ శాఖ అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు. ఇది అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారం...ఒక స్కెచ్ తోనే చేశారు అనే చర్చ కాంట్రాక్టర్ల సర్కిల్స్ లో కూడా ఉంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఫస్ట్ టర్మ్ లో ఎలాంటి మోడల్ ను ఫాలో అయ్యారో ఇప్పుడు కూడా అచ్చం అలాగే చేస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైకి అంతా పోటీ బిడ్డింగ్ లాగా కనిపించినా కూడా రాజధాని అమరావతిలో పనులు అన్ని కీలక స్థానాల్లో ఉన్న వాళ్ళు అంతా కలిసి ముందే ఒక ప్లాన్ ప్రకారం పంపకాలు చేశారు అనే విషయం ఈ పనులు దక్కిన తీరు చూస్తేనే అర్ధం అవుతోంది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. ఏ పని ఎవరికి ఇవ్వాలి...ఏ ప్యాకేజీ లో ఎంత ఎక్సెస్ ఉండాలి అన్నది కూడా అంతా ముందుగానే రెడీ చేసి...తర్వాత రంగంలోకి అస్మదీయ కంపెనీలను రంగంలోకి దించారు అని చెపుతున్నారు. అందుకే కొంత జాప్యం జరిగింది అనే అభిప్రాయం కూడా అధికారుల్లో ఉంది.
పక్కాగా నిబంధనలు పాటిస్తారు అనే పేరున్న ఐఏఎస్ అధికారి కాటంనేని భాస్కర్ ను కొద్ది నెలల క్రితమే చంద్రబాబు సర్కారు సిఆర్డీఏ కమిషనర్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తనకు సన్నిహితుడు అయిన ఐఏఎస్ అధికారి కె. కన్నబాబును భాస్కర్ స్థానంలో సిఆర్డీఏ కమిషనర్ గా తెచ్చుకున్నారు అని ఆ శాఖ వర్గాల్లో ప్రచారంలో ఉంది. మంత్రి నారాయణ ఏది చెపితే దానికి చంద్రబాబు కూడా ఓకే అంటారు అనే చెపుతారు టీడీపీ నేతలు. లోకేష్ తర్వాత నారాయణకు కూడా చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు అనే భావన టీడీపీ వర్గాల్లో ఎప్పటి నుంచో ఉంది. దీని వెనక చాలా లెక్కలే ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం ఇటీవలే సిఆర్డీఏ లో మొత్తం 22607 కోట్ల రూపాయల విలువైన 22 పనులకు, అమరావతి డెవలప్ మెంట్ కార్పొరేషన్ పరిధిలో 15095 కోట్ల రూపాయల విలువైన 37 ప్యాకేజీ లకు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇందులో ఏదో మొక్కుబడిగా ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి కి ఒకటి..మరో లిస్టింగ్ కంపెనీ నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ (ఎన్ సిసి ) వంటి కంపెనీలకు 2129 కోట్ల రూపాయల పనులు కేటాయించారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఎంతో సన్నిహితుడుగా పేరున్న బలుసు శ్రీనివాస రావు కంపెనీ బిఎస్ ఆర్ ఇన్ఫ్రా కు మాత్రం ఏకంగా పదిహేను పనులు అప్పగించారు. వీటి మొత్తం విలువ దగ్గర దగ్గర 6437 కోట్ల రూపాయల వరకు ఉంది.మరో అస్మదీయ కంపెనీ మేఘా ఇంజినీరింగ్ కు 5902 కోట్ల రూపాయల విలువైన ఆరు పనులు, ఆర్ వి ఆర్ ప్రాజెక్ట్స్ కు 4377 కోట్ల రూపాయల విలువైన ఎనిమిది పనులు కేటాయించారు. మిగిలిన పనులు అన్ని పంచినట్లుగా ఇతర సంస్థలకు కేటాయించారు.
విచిత్రం ఏమిటి అంటే ఈ పనుల్లో అన్నిటికి ఎక్సెస్ తప్ప..ఒక్క పనికి కూడా లెస్ కు టెండర్ దాఖలు కాలేదు. సహజంగా పోటీ ఉంటే కాంట్రాక్టర్లు లెస్ కు కూడా పనులు దక్కించుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. దీనికి ప్రధాన కారణం జగన్ ఐదేళ్ల కాలంలో పెద్దగా ..అంటే ఈ స్కేల్ లో నిర్మాణ పనులు ఏమీ జరగలేదు లేదు అనే విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకుతో పాటు వివిధ సంస్థల నుంచి తీసుకునే రుణాలు కూడా కలుపుని దగ్గర దగ్గర నలభై వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలిచినా కుడా కొంత మంది మాత్రమే ఇంత భారీ స్థాయిలో పనులు దక్కించుకున్నారు అంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు అనే వ్యాఖ్యలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఇవి రాబోయే రోజుల్లో చిక్కులు తెచ్చిపెట్టే అవకాశం లేకపోలేదు అనే చర్చ కూడా సాగుతోంది.