శోభా గ్రూప్ కు ఏపీ వైజాగ్, అమరావతిలో భూములు?!

Update: 2025-10-27 06:29 GMT

దుబాయ్ కేంద్రంగా పని చేసే శోభా గ్రూప్...బెంగళూరు కేంద్రంగా పని చేసే శోభా లిమిటెడ్ ఒకే గ్రూప్ కంపెనీలు. శోభా లిమిటెడ్ దేశంలోనే పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఒకటి. వచ్చే నెలలో జరగనున్న పెట్టుబడుల సదస్సు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దుబాయిలో పర్యటించి వచ్చిన సంగతి తెలిసిందే. అక్కడే ఆయన దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే శోభా గ్రూప్ చైర్మన్ రవి పీ ఎన్ సి మీనన్ తో కూడా సమావేశం అయ్యారు. ఆ సమయంలోనే రవి మీనన్ ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ప్రపంచ శ్రేణి లైబ్రరీ ఏర్పాటుకు వంద కోట్ల రూపాయలు సాయం అందించటానికి సిద్ధం అని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగానే వెల్లడించింది.

                                      నూతన రాజధాని అమరావతి లో వంద కోట్ల రూపాయలతో వరల్డ్ క్లాస్ లైబ్రరీ రానుండటం కీలక, శుభ పరిణామమే అని చెప్పొచ్చు. అయితే ఇప్పటి వరకు శోభా గ్రూప్ ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాంటి ప్రాజెక్ట్ లు చేపట్టలేదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఏ కార్పొరేట్ కంపెనీ అయినా ఇలా వందల కోట్ల రూపాయలు విరాళాలు ఉచితంగా ఇవ్వవు అని...ఈ సంస్థతో ప్రభుత్వం వచ్చే నెలలో జరగనున్న భాగస్వామ్య సదస్సులో ఒప్పందం చేసుకుని వైజాగ్ తో పాటు నూతన రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది అధికార వర్గాలు వెల్లడించాయి. అందులో భాగంగానే ఈ విరాళం ప్రకటించినట్లు ఉంది అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు.

                                 ఈ కంపెనీకి అటు వైజాగ్ తో పాటు అమరావతిలో కూడా భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. ఇటీవలే బెంగళూరు కేంద్రంగా పని చేసే రియల్ ఎస్టేట్ కంపెనీ సత్వా కు కూడా వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కారు చౌకగా కట్టబెట్టిన విషయం తెలిసిందే. అయితే శోభా గ్రూప్ ఈ వంద కోట్ల రూపాయల విరాళంతో ఎంత భారీ మొత్తంలో ల్యాండ్ బ్యాంకు దక్కించుకుంటుందో వేచిచూడాలి. అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇటు మంత్రి నారా లోకేష్ లు ఒక ప్లాన్ ప్రకారం రాష్ట్ర వనరులను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతూ తమ వల్లే రాష్ట్రాన్ని ప్రాజెక్టులు...పెట్టుబడులు వస్తున్నాని ప్రచారం చేసుకుంటున్నారు.

Tags:    

Similar News