ఏపీలో ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేయం

Update: 2021-06-05 11:47 GMT

    ఏపీ స‌ర్కారు ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల విష‌యంలో త‌న వైఖ‌రికే క‌ట్టుబ‌డి ఉంది. ఓ వైపు రాష్ట్రంలోని ప్ర‌తిప‌క్ష పార్టీలు ఈ క‌రోనా స‌మ‌యంలో ప‌రీక్షలు స‌రికాద‌ని వాదిస్తున్నాయి. ఇందుకు దేశంలోని ప‌లు రాష్ట్రాలు తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఉదాహ‌ర‌ణ‌గా చూపిస్తున్నాయి. అయినా స‌రే ప్ర‌భుత్వం మాత్రం ప‌రీక్షలు పెట్టి తీర‌తామ‌ని స్ప‌ష్టం చేస్తోంది. కొద్ది రోజుల క్రిత‌మే ప్ర‌ధాని మోడీ కూడా త‌మ‌కు పిల్ల‌ల ఆరోగ్యం, ప్రాణాలే ముఖ్యం అని..అందుకే సీబీఎస్ఈ 12వ త‌ర‌గ‌తి ప‌రీక్షలు ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జాతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను కూడా ఏపీ స‌ర్కారు ఏ మాత్రం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌టం లేదు. ఈ త‌రుణంలో ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో టెన్త్‌ పరీక్షలు రద్దు చేసే ప్రసక్తే లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పరిస్థితులు అనుకూలిస్తే టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేయాలనే ప్రతిపక్ష పార్టీల డిమాండ్ సరికాదన్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలకు టెన్త్‌ ప్రామాణికమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమ‌ర్శించారు.

Tags:    

Similar News