రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు
స్పష్టం చేసిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ను కేంద్రంలోని మోడీ సర్కారు డోంట్ కేర్ అంటోంది. వైజాగ్ స్లీట్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదని స్పష్టం చేసింది. అంతే కాదు..వంద శాతం వాటాల ఉపసంహరణ జరిగి తీరుతుందని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం నాడు లోక్ సభలో స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఈక్విటీ లేదని.. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. వైసీపీ ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. మెరుగైన ఉత్పాదకత కోసమే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తున్నామని..దీని ద్వారా కొత్తగా ప్రత్యక్షంగా, పరోక్షంగా అదనపు ఉపాధి అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. వైజాగ్ స్టీల్ కు చెందిన భూముల విలువే లక్ష కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనాలు ఉన్న సమయంలో ఏ ధరకు..ఏ సంస్థకు కేంద్రం దీన్ని విక్రయిస్తుంది అన్నది కీలకంగా మారింది.
ఏపీలో అధికార వైసీపీ ఎలాగైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెబుతూ వస్తోంది. త్వరలో జరగనున్నఅసెంబ్లీ సమావేశాల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ప్రతిపాదించారు. ఈ తరుణంలో నిర్మలా సీతారామన్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం రాజకీయంగా వైసీపీని కొంత ఇరకాటంలో పెట్టే అవకాశం ఉంది. అది కూడా మరో రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో వెలువడిన ఈ ప్రకటన ఏ మేరకు రాజకీయంగా ప్రభావం చూపిస్తుందో వేచిచూడాల్సిందే.