ఇదే వైసీపీ చంద్రబాబు పలు పథకాలకు తన పేర్లు పెట్టుకోవటంపై ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర విమర్శలు చేసింది. అధికారంలోకి వచ్చాక మాత్రం లెక్కలేనన్ని పథకాలకు జగన్ పేరు పెడితే మాత్రం ఇప్పుడు ఎవరూ నోరుతెరిచే పరిస్థితి లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనూ..ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కూడా ఎక్కువ శాతం రాష్ట్రాన్ని పాలిస్తున్నది రాయలసీమ నేతలే. విభజన తర్వాత తొలి ఐదేళ్లు చంద్రబాబు పరిపాలించారు. ఇప్పుడు జగన్. వీళ్ల వైఖరి ఎలా ఉంది అంటే పాలించేది మేమే..పేర్లు పెట్టుకునేది మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న హెల్త్ యూనివర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి..వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు..మరి కడపలో ఏదైనా ప్రతిష్టాత్మక సంస్థకు ఇదే జగన్ ఎన్డీఆర్ పేరు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు. ఇది సమస్యల నుంచి ప్రజలను పక్కదారి పట్టించే గెలుకుడు రాజకీయం తప్ప మరొకటి కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి తరలించాలని నిర్ణయం తీసుకున్నా ఈ ప్రాంత ప్రజలు పెద్దగా స్పందించలేదు కాబట్టే ఇలా జరుగుతున్నాయంటూ ఓ నేత వ్యాఖ్యానించారు.