వాయిదాల మీద వాయిదాలు. వాళ్లకు కావాల్సిన కంపెనీకి టెండర్ దక్కే వరకు అలా సాగదీశారు మొత్తం విషయాన్ని. ఇప్పుడు ఫైనల్ చేయటానికి నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యుత్ శాఖలో ఏకంగా ఐదు వేల కోట్ల రూపాయల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ టెండర్ కు సంబంధించిన వ్యవహారంలో సాగిన గోల్ మాల్ వ్యవహారం ఇది. అంచనాల దశలోనే ఏకంగా 20 శాతం మేర విలువ పెంచి ఈ టెండర్ దక్కించుకునే కంపెనీకి ప్రయోజనం కలిగేలా అంతా డిజైన్ చేశారు. తొలుత ఈ పనుల కోసం ఒక మెగా కంపెనీ ముందే స్కెచ్ వేసుకోగా...ఎవరూ ఊహించని రీతిలో నిత్యం నీతి, నిజాయతీల గురించి పదే పదే పెద్ద పెద్ద మాటలు చెప్పే ఒక కీలక మంత్రి ఒకరు రంగంలోకి దిగి తాము చెప్పిన వాళ్ళకే ఈ పనులు దక్కాలని ఆదేశించారు. ఆ మంత్రి తరపున ఒక దళారీ కూడా రంగంలోకి దిగి తమ సన్నిహితులకు చెందిన కంపెనీతో పని అంతా నడిపించారు. ఆ వ్యవహారం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరింది.
అనంతపురం జిల్లాలో యాడికి మండలంలోని కమలంపాడులో జెన్ కో తలపెట్టిన పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఆ శాఖ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలోని పవర్ ఫుల్ వ్యక్తులుగా ఉన్న వాళ్ళే చక్రం తిప్పినట్లు చెపుతున్నారు. అంతే కాదు..విద్యుత్ శాఖ మంత్రికి చెందిన టీం కూడా ఇందులో కీలకంగా పని చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు టెండర్ గడువును ఏకంగా ఆరు సార్లు పొడిగించినట్లు ఆ శాఖ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పుడు ఫైనల్ గా దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల విలువ గల ఈ ప్రాజెక్ట్ ను ఏఎంఆర్ సంస్థకు అప్పగించబోతున్నట్లు ఆ శాఖ వర్గాలు వెల్లడించాయి.
వాస్తవానికి ఈ సంస్థ మొదట్లో ఎక్కడా కూడా సీనులో లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ పై కన్నేసిన కీలక మంత్రే ఆ కంపెనీని రంగంలోకి దించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఒకటి , రెండు రోజుల్లోనే ఈ టెండర్ కేటాయింపు విషయాలు అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం కూటమి ప్రభుత్వంలో ఆల్ ఇన్ వన్ మినిస్టర్ గా పేరుగాంచిన ఆయన దగ్గరకు వెళ్లగా...ఇప్పటికే వాళ్లకు మైనింగ్ కాంట్రాక్టు లు ఇచ్చాం కదా...పవర్ ప్రాజెక్ట్ కూడా కావాలా అని వ్యాఖ్యానించినట్లు విద్యుత్ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీని వెనక ఎవరు ఉన్నారో తెలుసుకున్న తర్వాత ఆ ఆల్ ఇన్ వన్ మినిస్టర్ కూడా మౌనం వహించారు అని చెపుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ జెన్ కో చేపట్టే ఈ ప్రాజెక్ట్ ను ఎంత త్వరగా వీలు అయితే అంత త్వరగా పనులు అప్పగించి ప్రాజెక్ట్ పూర్తి అయ్యేలా చూడాలి కానీ కొంత మంది ఉన్నతాధికారులు తమకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్టు దక్కేలా చూడటం కోసం తమ వంతు సహకారం అందించారు అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ శాఖ లో కీలక స్థానాల్లో ఉన్న కొంత మంది అధికారులు రాష్ట్రం కోసం కాకుండా కొన్ని కంపెనీలు..కొంత మంది కాంట్రాక్టర్ల కోసం పని చేస్తున్నట్లు ఉంది అనే చర్చ కూడా సాగుతోంది.