రాజకీయం...వ్యాపారం కలిసిపోయి చాలా సంవత్సరాలే అయింది. కాకపోతే అది ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. గతంలో రాజకీయ నాయకులు పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి..కాంట్రాక్టర్ల నుంచి ఎన్నికల సమయంలో మాత్రమే విరాళాలు తీసుకునే వారు ఒకప్పుడు. ఇప్పుడు అది పూర్తిగా మారిపోయి తమకు కావాల్సిన సంస్థలకు తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎలాంటి ప్రాజెక్ట్ లు ఇవ్వొచ్చు...తద్వారా ఎంత లబ్దిపొందవచ్చు అన్న దగ్గర నుంచి ప్లాన్స్ మొదలు అవుతున్నాయి. కాంట్రాక్టుల విషయం లో కూడా అలాగే జరుగుతోంది. ఈ డీల్స్ తో ఇద్దరికీ భారీ ఎత్తున లాభాలు ఉండటంతో ఈ బంధాలు మరింత బలంగా మారుతున్నాయి. పరిస్థితి ఎంతలా మారింది అంటే ఒక పారిశ్రామికవేత్త...ఒక కాంట్రాక్టర్ పేరు చెపితే వాళ్ళు ఎవరికి దగ్గరో ప్రజలకు కూడా ఇట్టే తెలిసిపోతుంది. ఎందుకంటే ఈ బంధాలు అంతలా బయటపడుతున్నాయి..బరితెగిస్తున్నాయి అని చెప్పొచ్చు.

                                          తాజాగా హైదరాబాద్ కేంద్రం గా వివిధ కార్యకలాపాలు నిర్వహించే ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ కు చెందిన సంస్థలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. వాస్తవానికి ఈ దాడుల నిర్వహించిన టార్గెట్ వేరు అయినా కూడా ఈడీ నిర్వహించిన దాడుల్లో పలు కీలక విషయాలు బయటకు వచ్చినట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ దాడుల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన కీలక నేతలతో పాటు తెలంగాణ, కర్ణాటటకు కు చెందిన ముఖ్య నేతలకు సంబదించిన కొన్ని విషయాలు కూడా వెలుగుచూసినట్లు ఈ వర్గాలు తెలిపాయి. కాకపోతే ఈడీ ఎక్కడా కూడా అధికారికంగా ఈ దాడులపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కాకపోతే ఈడీ అధికారులు హైదరాబాద్ తో పాటు కోల్ కతా , చెన్నై, బెంగళూరు ల్లో ని సామ్సతకు చెందిన వివిధ కార్యాలయాలు దాడులు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (పీఎంఎల్ఏ) ప్రకారం ఈ దాడులు చేశారు. ఏఎంఆర్ సంస్థ అధినేత ఏ. మహేష్ రెడ్డి కి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోని ప్రభుత్వ పెద్దలతో ఎంతో సన్నిహితంగా ఉంటారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి.

                                           గత ఏడాది దుబాయ్ లో మహేష్ రెడ్డి తన కొడుకు పెళ్లి నిర్వహించగా..తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు కూడా దుబాయ్ వెళ్లారు. ఆ పర్యటన సమయంలోనే ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం కు సంబంధించి అక్కడే కొన్ని కీలక డీల్స్ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తర్వాత జరిగిన పరిణామాలు చూస్తే ఇదే నిజం అన్న సంకేతాలు ఇచ్చేలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఏఎంఆర్ సంస్థ సీనరేజి ఫీజు వసూళ్లు చేస్తూ అక్రమ మార్గాల్లో పెద్ద ఎత్తున వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇటీవల ఒక భారీ విద్యుత్ ప్రాజెక్ట్ ను కూడా మరో సంస్థతో కలిసి దక్కించుకుంది. ఈ రెండు వ్యవహారాల్లో ప్రభుత్వ పెద్దలు అండదండలు పూర్తి స్థాయిలో ఈ సంస్థకు దక్కాయి అనే విషయం తెలిసిందే. అయితే కేంద్రంలోని మోడీ సర్కారు ఈడీ దాడుల ద్వారా దక్కిన సమాచారంతో ఎలా ముందుకు వెళుతుంది అన్నదే ఇప్పుడు కీలక అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Tags: