యువ నేత...మరో పార్టీ అధినేత టీంలో టెన్షన్ టెన్షన్ !
కొంత మంది కాంట్రాక్టర్లు...బడా బడా వ్యాపారులు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళను చాలా ఈజీగా మేనేజ్ చేస్తున్నారు. మేనేజ్ చేయటం అంటే ఇందులో పెద్ద గా కష్టపడే పనేమిలేదు. ఇతరులతో పోలిస్తే అత్యంత వేగంగా అధికారంలో ఉన్న వాళ్ళు కోరుకున్న రీతిలో భారీ మొత్తాలు ఇవ్వటమే. ఇందుకు ప్రతిఫలంగా వాళ్ళు కోరుకున్నట్టు కాంట్రాక్టులు..ప్రాజెక్ట్ లు దక్కించుకోవటం. ఇది ఆంధ్ర ప్రదేశ్ లో సర్వసాధారణంగా మారిపోయింది. కూటమి పార్టీల కీలక నాయకులు పైకి మాత్రం దేశంలోనే తమ అంత నీతివంతమైన పాలన లేదు అన్నట్లు చెప్పుకుంటారు. కానీ తెరవెనక చేసే పనులు సొంత పార్టీ నేతలు కూడా అవాక్కు అయ్యేలా ఉన్నాయనే చర్చ టీడీపీ నేతల్లోనే సాగుతోంది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏఎంఆర్ కు చెందిన వివిధ సంస్థలకు చెందిన ఆఫీస్ లపై దాడులు నిర్వహించింది. ఏఎంఆర్ ఆంధ్ర ప్రదేశ్ లోని పలు జిల్లాల్లో సీనరేజ్ వసూళ్ల కాంట్రాక్టు దక్కించుకుని అక్రమ పద్దతిలో కోట్ల రూపాయల వసూళ్లు చేపడుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ వ్యవహారంపై మీడియా లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చినా కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం సైలెంట్ గా ఉంది. దీనికి ప్రధాన కారణం ఈ వ్యవహారంలో ఎవరి వాటాలు వాళ్లకు వెళ్ళటమే అని చెపుతున్నారు. అధికారులు కూడా ఎన్ని వార్తలు వచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోరు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు ఈ మైనింగ్ వ్యవహారంలో కోట్ల రూపాయల మేర ముడుపులు ముడుతున్నాయని అధికారులు కూడా చెపుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అప్పగించిన బాధ్యతలకు మించి ఏఎంఆర్ సంస్థ ప్రైవేట్ రాజ్యం తరహాలో పెద్ద ఎత్తున టీం లు పెట్టి వసూళ్లు చేస్తోంది అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇలా వసూళ్లు చేసిన మొత్తంలో ప్రభుత్వానికి కట్టేది కొంత...ప్రభుత్వ పెద్దలు...ప్రైవేట్ సంస్థ కలిసి పంచుకునేది మాత్రం కొండంత. ఈ మైనింగ్ వ్యవహారం చాలదు అన్నట్లు ఈ సంస్థ ఇటీవల మరో కంపెనీ తో కలిసి దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల రూపాయల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ లో కూడా కీలక వాటా దక్కించుకుంది అని అధికార వర్గాలు వెల్లడించాయి.
మైనింగ్ వాటాలు కూటమిలో ఒక పార్టీకి...ఈ విద్యుత్ ప్రాజెక్ట్ లో వాటాలు మరో భాగస్వామి పార్టీ కి వాటాగా వెళుతున్నాయని అధికార వర్గాలు చెపుతున్నాయి. తాజా ఈడీ దాడులతో తమ అక్రమ లావాదేవీలకు చెందిన లింక్ లు ఎక్కడ మళ్ళీ కేంద్రంలోని మోడీ సర్కారు చేతికి వెళతాయో అన్న భయం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని యువ నేత తో పాటు మరో పార్టీ అధినేత టీం లో కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. ఎందుకంటే సీనరేజ్ ఫీజు వసూలులో అక్రమంగా సంపాధించిన మొత్తంలో ప్రభుత్వ పెద్దల వాటాలను షెల్ కంపెనీల ద్వారా తరలించారు అనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈడీ జరిపిన దాడులతో సీనరేజ్ లెక్కల అక్రమ వసూళ్ల తరలింపులు...విద్యుత్ ప్రాజెక్ట్ డీల్ విషయాలు బయటకు వస్తే కేంద్రంలోని మోడీ సర్కారు చేతికి కూటమి పెద్దలు చిక్కినట్లే అన్న చర్చ రాజకీయ, అధికార వర్గాల్లో సాగుతోంది. అయితే కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది అనే ధీమాతోనే కొంత మంది నేతలు ఆంధ్ర ప్రదేశ్ లో ఇష్టానుసారం చేస్తున్నారు అనే అభిప్రాయం కొంత మంది మంత్రుల్లో కూడా ఉంది. ఈ దాడుల వ్యవహారంతో రాబోయే రోజుల్లో ఎన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి. అయితే కొంత మంది బీజేపీ నేతలు మాత్రం ఎప్పటికప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో జరుగుతున్న చీకటి డీల్స్ వివరాలు కేంద్ర పెద్దలు చేరవేస్తున్నట్లు ఒక బీజేపీ నాయకుడు వెల్లడించారు.