అంతా కలిసి వాటాలు పంచుకుంటున్నారు అనే ఆరోపణలు

సంపద సృష్టి. టీడీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే చెప్పే మాట. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మాత్రం ఆయన రాష్ట్రానికి సంపద సృష్టించటం సంగతి ఏమో కానీ... కొన్ని కంపెనీలు...కొంత మంది కాంట్రాక్టర్లకు సంపద సృష్టించటం కోసమే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది అనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎంపిక చేసిన కంపెనీలు...కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున అంటే ఏకంగా వందలు...వేల కోట్ల రూపాయల్లో ప్రయోజనం కల్పిస్తున్నట్లు కనిపిస్తోంది అనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.దీని ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు తిరిగి పెద్ద ఎత్తున ప్రతిఫలం పొందుతున్నారు అని ప్రభుత్వ వర్గాలు చెపుతున్నాయి. గతంతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో సారి మాత్రం ట్రెండ్ పూర్తిగా మారిపోయింది అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో కూడా ఉంది. ఒక వైపు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు పెద్ద ఎత్తున అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంది. నిత్యం అప్పులు చేస్తే తప్ప ప్రభుత్వం ముందుకు కదలని పరిస్థితి. అయినా సరే కొన్ని కంపెనీల విషయంలో చంద్రబాబు సర్కారు అనుసరిస్తున్న విధానం తీవ్ర విమర్శల పాలు అవుతోంది...ఎన్నో అనుమానాలకు కూడా కారణం అవుతోంది. అందుకే ప్రత్యక్ష ఉదాహరణే ఈ ఉదంతం.

                                               ఆంధ్రప్రదేశ్‌లోని ఆరు జిల్లాల్లో సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టర్లుగా (ఎస్ సి సి ) ఎంపికైన ఏఎంఆర్ ఇండియా, సుధాకర ఇన్‌ఫ్రాటెక్ సంస్థలు టెండర్ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తూ 60 కోట్ల రూపాయల మేర స్టాంప్ డ్యూటీని ఎగవేశాయి. రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు మాత్రం ఆ మొత్తాన్ని వసూలు చేసేందుకు ఆసక్తి చూపకుండా ఈ అంశాన్ని దాటవేస్తున్నాయి...ఆయా కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రెండు సంస్థలు సీనరేజ్ తో పాటు రాయల్టీని కూడా ప్రభుత్వానికి చెల్లించకుండా నెలల తరబడి జాప్యం చేస్తూ అనుచిత లబ్దిపొందుతున్నాయి అని చెపుతున్నారు. టెండర్ నిబంధనల ప్రకారం ఈ సంస్థలు ప్రతి నెల ప్రారంభంలోనే ముందస్తుగా చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అలాగే రూ.600 కోట్ల రూపాయల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ (DMF), దాదాపు రూ.200 కోట్ల వస్తు, సేవల పన్ను (GST), మరో రూ.20 కోట్ల ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (TCS) వంటి చట్టబద్ధమైన చెల్లింపుల విషయంలోనూ అనేక వ్యత్యాసాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

                                                        ఒక వైపు ఎక్కడ లీకేజ్ లేకుండా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయ వనరుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెపుతుంటే అందుకు భిన్నంగా కొంత మంది మంత్రులు...ఐఏఎస్ అధికారులు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది అనే చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ప్రభుత్వ ఖజానాకు మరిన్ని ఆదాయ మార్గాలను అన్వేషించాలని, పెండింగ్‌లో ఉన్న బకాయిలను రాబట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పదేపదే ఆదేశిస్తున్న సమయంలో గనులు, భూగర్భ వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.కె. మీనా వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టులను కేటాయించే సమయంలో 2025 సెప్టెంబర్ 10న మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ టెండర్ నిబంధనలను ఉటంకిస్తూ ఎంపికైన సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టర్స్ నుంచి అవసరమైన స్టాంప్ డ్యూటీని పూర్తిగా వసూలు చేసిన అనంతరం ఒప్పందాలు చేసుకోవాలని జిల్లా మైన్స్ అండ్ జియాలజీ అధికారులను ఆదేశించారు. అయితే జిల్లా అధికారులు 2025 అక్టోబర్ 8న స్టాంప్ డ్యూటీ వసూలు చేయకుండానే ఒప్పందాలు చేసుకున్నారు. అంతేకాకుండా, ఒక నెల వ్యవధిలో కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయాల్సిన అసలు స్టాంప్ డ్యూటీ ఎంత అన్న విషయాన్ని తెలుసుకునేందుకు జిల్లా రిజిస్ట్రార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులను సంప్రదించే ప్రయత్నం కూడా చేయలేదు.

                                        కాంట్రాక్టర్లతో కుమ్మక్కైనట్లుగా కనిపిస్తున్న జిల్లా రిజిస్ట్రార్లు, గనుల శాఖ అధికారులు పంపిన లేఖలను పట్టించుకోలేదు. స్టాంప్ డ్యూటీ వసూళ్లలో జరుగుతున్న జాప్యంపై ఆర్టీఐ కింద కొంత మంది ప్రశ్నలు లేవనెత్తిన తర్వాతే, 2026 ఆగస్టులో జిల్లా రిజిస్ట్రార్లు స్పందించి, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేయాల్సిన స్టాంప్ డ్యూటీ మొత్తాలను సిఫారసు చేశారు. మైన్స్ అధికారులు కూడా కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయాలని లేఖలు రాసి తమ బాధ్యతను ముగించుకున్నట్లు వ్యవహరించారు. ఇప్పటివరకు సీనరేజ్ కలెక్షన్ కాంట్రాక్టర్ల నుంచి స్టాంప్ డ్యూటీ కింద ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదు. టెండర్ నిబంధనలను మరోసారి తీవ్రంగా ఉల్లంఘిస్తూ, ప్రతి నెల ప్రారంభంలోనే ఎస్ సిసి లు సీనరేజ్ మొత్తాన్ని ముందస్తుగా చెల్లించి, అదే నెలలో మైనింగ్ కాంట్రాక్టర్ల నుంచి ఆ మొత్తాన్ని వసూలు చేయాల్సి ఉండగా, ఈ రెండు సంస్థలు మాత్రం మైనింగ్ ఓనర్ల నుంచి వసూలు చేసిన సీనరేజి మొత్తాన్ని నెలల తరబడి తమ వద్దే ఉంచుకునేందుకు అనుమతించారు.

                                       ఉదాహరణకు, 2026 ఆగస్టు 13 తేదీతో జారీ చేసిన డిమాండ్ నోటీసు నంబర్ 1306/SCC-VSP/2025 ప్రకారం, ఏఎంఆర్ ఇండియా కాంట్రాక్టు కేటాయించిన రెండు నెలల తర్వాత కూడా ఈ ఏడాది జనవరి 5 వరకు తొలి విడత చెల్లింపు చేయలేదు. ఆ తర్వాత కూడా టెండర్ నిబంధనలను పట్టించుకోకుండా, తనకు అనుకూలమైన సమయంలో చెల్లింపులు చేసింది. “విశాఖపట్నంలో ఏఎంఆర్ ఇండియా నుంచి చెల్లించాల్సిన రూ.158 కోట్లలో సంస్థ కేవలం రూ.80 కోట్లు మాత్రమే చెల్లించింది. మరో రూ.80 కోట్లను ప్రభుత్వ పనుల్లో ఉపయోగించిన మెటీరియల్‌కు సంబంధించిన సీనరేజ్ ఫీజు రూపంలో శాఖ సర్దుబాటు చేసింది. ప్రభుత్వ పనులకు సంబంధించిన క్లెయిమ్‌లపై సమగ్ర విచారణ జరపాలి. ఎందుకంటే అనేక క్లెయిమ్‌లు బోగస్‌గా ఉన్నాయి అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ప్రైవేట్ సంస్థలకు మేలు చేసేలా ఈ వెసులుబాటు కల్పించినట్లు కొంత మంది అధికారులు చెపుతున్నారు. మరో వైపు ఈ సీనరేజు కలెక్షన్ సంస్థలు అధికారికంగా వసూలు చేసే మొత్తం కొంత అయితే...అనధికారికంగా భారీ ఎత్తున వసూళ్లు చేస్తూ ప్రభుత్వ పెద్దలకు...అధికారులకు నెలవారీగా చెల్లింపులు చేస్తున్నారు అని గనుల శాఖ వర్గాలు చెపుతున్నాయి. కొన్ని కంపెనీల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైకి చెప్పే ఆదేశాలు ఒకటి...తర్వాత అనధికారికంగా చెప్పే మాటలు మరో విధంగా ఉంటున్నాయి అని కొంత మంది అధికారులు చెపుతున్నారు.

Tags: