స్కాంల్లో స్కాం లు చేయటం ఆంధ్ర ప్రదేశ్ లోని కొంత మంది కూటమి నేతలకు బాగా అలవాటు అయిపోయింది. ఈ టర్మ్ లో ఎక్కువగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. కొత్తగా స్కాం చేయటం కంటే గత ప్రభుత్వంలో జరిగిన స్కాం ల సొమ్ము నుంచే తాము కూడా తమ వాటాలు తీసుకుంటే సుఖం కదా అనుకున్నట్లు ఉన్నారు అధికార పార్టీ నేతలు. ఎక్కువ కేసు ల్లో ఇదే మోడల్ ఫాలో అవుతున్నారు. సంచలనం సృష్టించిన ఆంధ్ర ప్రదేశ్ లిక్కర్ స్కాం విషయం ఎన్నో మలుపులు తిరుగుతోంది. కానీ ఈ స్కాం కు సంబంధించి అసలు సూత్రధారుల దగ్గరకు మాత్రం ఈ కేసు వెళ్లటం లేదు. ఎంపిక చేసిన వాళ్ళను మాత్రం అరెస్ట్ చేస్తున్నారు. అధికార పార్టీ పెద్దలు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళను మాత్రం వదిలేస్తున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లోనే ఎప్పటి నుంచో సాగుతోంది.
ఈ స్కాం వెలుగులోకి వచ్చిన తర్వాత దుబాయ్ వేదికగా ప్రభుత్వంలో అంతా నడిపిస్తున్న ఒక వ్యక్తి మద్యం స్కాం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తితో డీల్ కుదుర్చుకున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అందులో భాగంగానే అసలు వ్యక్తి దగ్గరకు ఈ కేసు పోవటం లేదు అనే ప్రచారం టీడీపీ నేతల్లో కూడా ఉంది. ఇది ఒకటి అయితే లిక్కర్ రవాణాకు సంబంధించిన టెండర్ల లో కూడా కొంత మంది వైసీపీ నేతలు కోట్ల రూపాయల మేర లబ్ది పొందినట్లు గుర్తించారు. అందులో భాగంగానే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వర రావు ను కూడా కొద్దీ రోజుల క్రితం అరెస్ట్ చేశారు. ఇదే కేసు లో మరో వైసీపీ కీలక నాయకుడు అరెస్ట్ కావాల్సి ఉన్నా కూడా చివరి నిమిషాల్లో ఇది ఆగిపోయింది.
ఆ నాయకుడి కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి ఈ రవాణా టెండర్లకు సంబంధించిన నిధుల బదిలీ జరిగినట్లు గుర్తించారు. అయినా సరే ఈ అరెస్ట్ ఆగిపోవటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చేయటం ద్వారా ఆ స్కాం సొమ్ములో వాటాలు తీసుకోవటంతో పాటు రకరకాలుగా ఇతర ప్రయోజనాలు పొందుతున్నట్లు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఇవి అన్నీ చూసే కూటమి ప్రభుత్వంలో ఏది చూసినా ఇది ‘చిన్న’ కథ కాదు అన్న చందంగా పరిస్థితి తయారు అయింది అని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే వచ్చే ఎన్నికల తర్వాత కాకుండా...ఆ తర్వాత ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వం మారినా కూడా ఈ కేసు ను మళ్ళీ రీ ఓపెన్ చేయరు. ఎందుకంటే ఈ స్కాం జరిగిందే వైసీపీ హయాంలో కాబట్టి. ఇదే ధీమాతో గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు భారీ స్కాం లకు సంబంధించిన అంశాల్లో ఇలాంటి సెటిల్మెంట్స్ సాగిపోతున్నట్లు చెపుతున్నారు. ఇవి అన్నీ చూస్తుంటే ప్రభుత్వంలో పెద్ద పెద్ద కథలే నడుస్తున్నట్లు కనిపిస్తోంది.