ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మాట సమాచార, పౌర సంబంధాల శాఖ అధికారులు వినటం లేదా?. లేక విమర్శలు వచ్చాయి కాబట్టి ఏదో కంటి తుడుపుగా మాటలు చెప్పి...ఎప్పటి లాగానే పని కానివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐ అండ్ పీఆర్ అధికారులను ఆదేశించారా?. శనివారం నాటి ఆంధ్ర ప్రదేశ్ పత్రికల్లో ప్రకటన చూసిన తర్వాత ఎవరికైనా ఇదే అనుమానం రావటం సహజం. కొద్ది రోజుల క్రితం వరసగా సాగునీటి ప్రాజెక్ట్ ల ప్రారంభోత్సవాలు జరిగాయి. ఆ సమయంలో ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల్లో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఫోటో లు వేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మినహా ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మరో మంత్రి నారా లోకేష్ ఫోటోలు మాత్రమే ప్రభుత్వ ప్రకటనల్లో వేస్తున్నారు. ప్రభుత్వం అంటే ఈ ముగ్గురే తప్ప మిగిలిన మంత్రులు అంతా నామమాత్రం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశంపై పలు మార్లు వార్తలు రాసినా కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అంటా మా ఇష్టం అన్నట్లు వ్యవహరిస్తూ సాగుతోంది.
కానీ సడన్ గా కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక సమావేశంలో ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి అని...అధికారిక ప్రకటనల్లో మంత్రులకు చోటు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఐ అండ్ పీఆర్ శాఖను ఆదేశించినట్లు మీడియా లో వార్తలు వచ్చాయి. ప్రభుత్వం నుంచి జారీ అయ్యే ప్రతి ప్రకటన కూడా ఖచ్చితంగా సీఎంఓ క్లియరెన్స్ తర్వాతే బయటకు వస్తుంది అని అధికారులు చెపుతున్నారు. సీఎం చంద్రబాబు అంత స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రకటనల్లో సంబంధిత శాఖ మంత్రి ఫోటో రాలేదు అంటే మంత్రులు అంటే ఐ అండ్ పీఆర్ అధికారులకు లెక్క లేదా?. లేదు అంటే చంద్రబాబు నాయుడు ఏదో కంటి తుడుపుగా మీడియా కు లీక్ ఇచ్చి ఎప్పటిలాగానే మా ముగ్గురు ఫోటో లు మాత్రమే వేయాలని చెప్పారా అన్న చర్చ సాగుతోంది. దీనిపై మరో వాదన కూడా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ప్రకటనలో సంబంధిత శాఖ మంత్రి ఫోటో వేయాలని చెప్పినా కూడా ప్రభుత్వంలో అనధికారిక సీఎం గా వ్యవహరిస్తున్న నారా లోకేష్ మంత్రుల ఫోటోలు వద్దు అని చెప్పారా అన్న సందేహాలు కూడా కొంత మంది మంత్రులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఈ ఇళ్ల పట్టాలు కూడా కొత్తగా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. గతంలో ఇచ్చిన వాటిని రెగ్యూలరైజ్ చేస్తున్నావే. వీటికి మళ్ళీ కోట్ల రూపాయల ఖర్చుపెట్టి ప్రచారం చేసుకోవటం...అందులో సంబంధిత మంత్రి ఫోటో లేకుండానే ప్రకటనలు జారీ చేయటం చూస్తుంటే అంతా మాయ అనే చెప్పొచ్చు.