వేల కోట్ల ప్రభుత్వ ఆస్తి పార్టీల నేతల పాలు !

Update: 2024-10-18 06:44 GMT

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రికి దసపల్లా భూములు ఇప్పుడు రసగుల్లా లాగా దొరికాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే ఎక్కడెక్కడ ఖరీదైన వివాదాస్పద భూములు ఉన్నాయి...వాటిలో ఏమి చేయవచ్చో ఆ మంత్రి ఒక స్కెచ్ వేసుకున్నారు. ఎందుకంటే ప్రభుత్వంలో అయన ఏమి చెపితే అదే జరుగుతుంది కాబట్టి ఆయనకు ఇది పెద్ద విషయంలా కూడా అనిపించలేదు. ఆయన ప్రత్యేక ఫోకస్ విశాఖపట్నం పై ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే వైసీపీ హయాంలో జరిగిన దసపల్లా డీల్ లో ఇప్పుడు ఆ యువనేత ఎంట్రీ ఇచ్చినట్లు ఈ వ్యవహారంతో సంబందం ఉన్న వర్గాలు చెపుతున్నాయి. తొలుత ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ కీలక నేతలు అంతా వేల కోట్ల రూపాయల విలువ చేసే దసపల్లా భూములను టీడీపీ ప్రభుత్వం అస్మదీయులకు కట్టబెతోంది అని విమర్శలు గుప్పించారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ చేయలేని పని అప్పటి వైసీపీ సర్కారు చేసింది. ప్రభుత్వంలో ఈ భూములు క్లియర్ కావటానికి ముందే ఆ పార్టీ కి చెందిన కీలక నేతలు హక్కుదారులతో ఒప్పందాలు చేసుకుని భూములు తమ చేతికి వచ్చేలా చేసుకున్నారు. కోర్టు ఆదేశాల పేరు చెప్పి వైసీపీ ప్రభుత్వం కూడా ఈ భూములను నిషేదిత జాబితా నుంచి తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చేసింది.

                                                                 ఇప్పటికే గత ప్రభుత్వానికి చెందిన పెద్దల సన్నిహితుల చేతికి ఇవి ఒప్పందాల రూపంలో వెళ్లిపోయాయి. ప్రతిపక్షంలో ఉండగా ఈ భూములను కాపాడాలి అంటూ నినదించిన టీడీపీ, జనసేన లు ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్లే కనిపిస్తోంది. పైగా ఇప్పడు ఎవరైతే ఒప్పందాల ద్వారా ఈ భూమిని దక్కించుకున్నారో వాళ్ళతో డీల్ సెట్ చేసుకున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ సాఫీగా ముందుకు సాగాలంటే ప్రభుత్వ అండదండలు కావాలి కాబట్టి ఆ యువ మంత్రితో సెటిల్ మెంట్ కు ఆ ఎంపీ మనుషులు కూడా ముందుకు వచ్చారు అని...తెర వెనక దీనికి కావాల్సిన పనులు అన్ని సాగుతున్నట్లు చెపుతున్నారు. అంటే ఇప్పుడు ఆ యువ మంత్రికి సంబందించిన వ్యక్తులు కూడా ఈ ప్రాజెక్ట్ లో భాగస్వాములు అవుతారు అన్న మాట. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు వేల కోట్ల రూపాయల విలువ చేసే దసపల్లా భూములను అధికార పార్టీ కి చెందిన వాళ్ళతో పాటు ప్రతిపక్ష పార్టీ కి కావాల్సిన వాళ్ళు కూడా కలిసి వాటాలుగా పంచుకోబోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది అని ఒక టీడీపీ సీనియర్ నేత వెల్లడించారు. ప్రభుత్వ...ప్రజల సొమ్ము పార్టీల పాలు అంటే ఇదేనేమో.

Tags:    

Similar News