వైజాగ్ లో వేల కోట్ల రూపాయల విలువ చేసే దసపల్లా భూముల వ్యవహారంలో రోజుకో కొత్త కథ వెలుగులోకి వస్తోంది. విచిత్రం ఏమిటి అంటే వైజాగ్ లోని టీడీపీ సిటీ ఆఫీస్ దసపల్లా భూముల్లోనే ఉంది. సుదీర్ఘకాలం ఇవి ప్రభుత్వ భూములు అని పోరాటం కొనసాగింది.వైసీపీ హయాంలో వీటిని నిషేదిత జాబితా నుంచి మినహాయించి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారు. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే ఇవి ప్రభుత్వ భూములు అని...ప్రభుత్వం నుంచి లీజ్ కు తీసుకున్నామని చెప్పి తెలుగు దేశం పార్టీ సిటీ ఆఫీస్ కట్టారు ఆ భూముల్లోనే. వైసీపీ హయాంలో ఇక్కడ పార్టీ ఆఫీస్ నిర్మాణం అక్రమం అంటూ నోటీసులు ఇవ్వగా...టీడీపీ కోర్ట్ కు వెళ్లి రిలీఫ్ పొందింది. విచిత్రం ఏమిటి అంటే ప్రభుత్వ భూములు అని చెప్పి లీజ్ కు తీసుకుని కట్టిన ఆ భూమి ఇప్పుడు ప్రైవేట్ పరం అయింది. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ భూమిని దక్కించుకున్న ప్రైవేట్ డెవలపర్లకు ఇప్పుడు అధికార తెలుగు దేశం పార్టీ ఆ భూమికి ధర కట్టి చెల్లిస్తుందా?.. లేక ఈ భూముల్లో వంద అడుగుల రోడ్డు కు అనుమతి ఇచ్చినందున క్విడ్ ప్రో కో లో భాగంగా టీడీపీ ఆఫీస్ ను ఆ వైసీపీ డెవలపర్లు అలా వదిలేస్తారా?. ఇదే ఇప్పుడు అందరిలో ఆసక్తిరేపుతున్న అంశం.
టీడీపీ ప్రభుత్వం వైసీపీ డెవలపర్లకు వేల కోట్ల రూపాయల మేర లబ్ధికలిగేలా 100 అడుగుల రోడ్డు ను మాస్టర్ ప్లాన్ లో చేర్పించటంతో పాటు ట్రాన్సఫరబుల్ డెవలప్మెంట్స్ బాండ్స్ కూడా కేటాయించటం ద్వారా వాళ్లకు మరింత మేలు చేయనుంది. ఇది కూడా వేల కోట్ల రూపాయల్లోనే ఉంటుంది అని చెపుతున్నారు. మరి ఇంత మేలు చేస్తున్న టీడీపీ నుంచి ఈ ఆఫీస్ స్థలం కోసం వైసీపీ డెవలపర్లు డబ్బులు తీసుకుంటారా లేక దీన్ని క్విడ్ ప్రో ఖాతాలో వేస్తారా అన్నది వేచిచూడాల్సింది. టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి నారా లోకేష్ ఎప్పుడు వైజాగ్ వచ్చినా కూడా ఇక్కడే సమావేశాలు పెట్టడంతో కొన్ని సార్లు విశ్రాంతి కూడా తీసుకుంటారు అని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. పలు మార్లు లోకేష్ ఇక్కడ ప్రజాదర్భారులు నిర్వహించారు అని తెలిపారు. రేపు ఎప్పుడైనా నారా లోకేష్ ఇక్కడ ప్రజా దర్భారు నిర్వహిస్తే...ప్రైవేట్ ల్యాండ్ లో టీడీపీ ఆఫీస్ ఎలా కట్టారు అని ఎవరైనా ప్రశ్నిస్తే చిక్కులు తప్పవని ఒక నేత వ్యాఖ్యానించారు.
టీడీపీ ఆఫీస్ ఒక్కటే కాదు..ఇదే ప్రాంతంలో జీవీఎంసీ వాటర్ ట్యాంక్ కూడా ఉంది అని...ఈ విషయంలో ప్రైవేట్ డెవలపర్లు ఎలా వ్యవహరిస్తారు అన్నది కూడా వైజాగ్ లో ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ ఆఫీస్ ను అలాగే వదిలేసి...జీవీఎంసి వాటర్ ట్యాంకర్ ఒక్కటే తొలగిస్తే అది ఖచ్చితంగా రాజకీయ దుమారం రేపే అవకాశం ఉంది. కొంత మంది ప్రభుత్వ పెద్దలు ఈ దసపల్లా లేటెస్ట్ డీల్ లో భారీగా లబ్దిపొందుతున్నందున అందరి కళ్ళు ఈ ఈ వ్యవహారంపైనే ఉన్నాయి. దీని కోసం ఒక మంత్రి కిమ్ టీం తో తన తరపున అన్ని డీల్స్ పూర్తి చేయిస్తున్నారు అనే చర్చ టీడీపీ నేతల్లోనే ఉంది. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారంలో ఇంకెన్ని మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.