గత వైసీపీ ప్రభుత్వంలో వైజాగ్ లో వేల కోట్ల రూపాయల భూములను రాజకీయ నేతలు ఎలా దక్కించుకున్నారో...ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. దీనికోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలోని ఒక కీలక మంత్రి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆ పార్టీ నేతలే చెపుతున్నారు. ఆయన తెరవెనక ఉండి...వీళ్ళను తెర ముందు పెట్టి అనుకున్న విధంగా అన్ని పనులు పూర్తి చేయించుకుంటున్నారు. వైజాగ్ లోని అత్యంత విలువైన దసపల్లా భూముల్లో ఇప్పుడు డబుల్ ధమాకాకు రంగం సిద్ధం అయినట్లు టీడీపీ వర్గాలే చెపుతున్నాయి. దసపల్లా భూములు ఉన్న ప్రాంతంలో వంద అడుగుల రోడ్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతోనే ఈ భూములకు వాణిజ్యపరంగా విలువ మరింత పెరిగింది. ఇది ఒకటి అయితే ఇప్పుడు దీనికి తోడు వీళ్లకు ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ బాండ్స్ (టీడీఆర్) ఇవ్వటం ద్వారా ఈ భూములను డెవలప్మెంట్ కోసం దక్కించుకున్న వాళ్లకు మరింత ప్రయోజనం కల్పించనున్నారు. అవి కూడా 1000 కోట్ల రూపాయల నుంచి 1500 కోట్ల రూపాయల మేర వీళ్లకు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి అని చెపుతున్నారు.
ప్రస్తుతం ఈ ప్రాంతంలో 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉండటం వల్ల అక్కడ జీ ప్లస్ 4 కు మాత్రమే అనుమతులు దక్కుతాయి అని... అదే ఇప్పుడు వంద అడుగుల రోడ్ కు మాస్టర్ ప్లాన్ లో చోటు కల్పించినందున ఇక్కడ ఎకరాకు తక్కువలో తక్కువగా 4 లక్షల నుంచి ఐదు లక్షల ఎస్ఎఫ్ టి నిర్మాణాలకు అనుమతి దక్కే అవకాశం ఉంది. ఈ లెక్కన చూసుకుంటేనే రోడ్ ను 40 అడుగుల నుంచి 100 అడుగులకు మార్చటం వల్ల పెరిగే ఎస్ఎఫ్ టి ద్వారానే ఒక్కో ఎకరంపై దగ్గర దగ్గర 400 నుంచి 500 కోట్ల రూపాయల వరకు అదనపు ప్రయోజనం కలగబోతోంది అని చెపుతున్నారు. ప్రాజెక్ట్ మొత్తం మీద చూసుకుంటే ఇది ఎంత లేదు అన్నా ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది అనేది రియల్ ఎస్టేట్ వర్గాలు చెపుతున్న మాట. వైసీపీ నేతల చేతిలో ఉన్న భూములకు ఇంత మేర ప్రయోజనం చేకూర్చిపెడుతున్నందున ప్రభుత్వంలో కీలక మంత్రి టీం కు కూడా అదే స్థాయిలో వాటాలు దక్కనున్నాయి. అంతే కాకుండా టీడీఆర్ బాండ్స్ ద్వారా కూడా హై రైజ్ బిల్డింగులను మరింత పెంచుకుని ఇంకా లాభపడనున్నారు. ఈ లెక్కలు అన్నీ వేసే తమ వాటాల లెక్కలను కూడా ఆ మంత్రి టీం ఫైనల్ చేసినట్లు సమాచారం.