ఆంధ్ర ప్రదేశ్ లోని వైజాగ్ ఎయిర్ పోర్ట్ ఇక నుంచి హైదరాబాద్ లోని బేగంపేట్ ఎయిర్ పోర్ట్ గా మారబోతోంది. హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేసిన తర్వాత బేగంపేట ఎయిర్ పోర్ట్ లో వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేశారు. కేవలం ప్రైవేట్ జెట్స్ తో పాటు ఇతర వీవీపీల విమానాల రాకపోకలకే దీన్ని వినియోగిస్తున్నారు. అన్ని వాణిజ్య విమాన సర్వీసులు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచే సాగుతున్నాయి. ఇప్పుడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ కూడా అలాగే మారబోతుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా భోగాపురంలో జీఎంఆర్ సంస్థ అభివృద్ధి చేసిన గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి వాణిజ్య సర్వీసులు ఆగస్ట్ 17 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్ట్ 1 న ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీని కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్ట్ 17 అర్ధరాత్రి నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో వాణిజ్య విమాన సర్వీసులు నిలిపివేస్తూ...అదే సమయం నుంచి భోగాపురంలో అల్లూరి సీతారామరాజు ఎయిర్ పోర్ట్ నుంచి సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.