మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం నాడు తిరుమలలో కీలక ప్రకటన చేశారు. తాను కొత్త పార్టీ పెడుతున్నాని...తమ పార్టీ విధి, విధానాలను కూడా ఈ నెలలోనే విజయవాడ లో ప్రకటించనున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి అనుగుణంగానే ఆయన ఇప్పుడు పార్టీ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. వైసీపీ కి గుడ్ బై చెప్పిన తర్వాత విజయసాయిరెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లో చేరతారు అని జోరుగా ఊహాగానాలు సాగాయి. దీనికి ప్రధాన కారణం ప్రధాని మోడీ తో పాటు బీజేపీ కీలక నేతలతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలే. కారణాలు ఏంటో తెలియదు కానీ బీజేపీ లో చేరికకు మాత్రం బ్రేక్ పడింది. ఇప్పుడు ఏకంగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో కొత్తగా పెట్టబోయే పార్టీ కోసం ఆఫీస్ లు చూడాల్సిందిగా తన సన్నిహిత నేతలకు విజయసాయి రెడ్డి బాధ్యతలు అప్పగించినట్లు చెపుతున్నారు.
బుధవారం తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మీడియా తో మాట్లాడిన విజయసాయిరెడ్డి ప్రజల సమస్యలు, ప్రజావాణిని చట్టసభల్లో బలంగా వినిపించేందుకు రాజకీయ పార్టీని ప్రారంభించాలని సంకల్పించినట్లు తెలిపారు. అందులో భాగంగానే శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నానని చెప్పారు. ఇది ఇలా ఉంటే విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ వల్ల ఎవరికీ లాభం...ఎవరికీ నష్టం ఉంటుంది అన్న చర్చ సాగుతోంది. విజయసాయి రెడ్డి పార్టీ ప్రభావంపై ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రావటం తొందరపాటే అవుతుంది. అయితే ఆయనకు ఉన్న గత రాజకీయ చరిత్ర...అనుబంధాలు వంటి అంశాలను తీసుకుంటే ఉంటే గింటే కొంత నష్టం వైసీపీ కి మాత్రమే ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. అది ఎంత మేర అన్నది కూడా ఇప్పుడే చెప్పటం కష్టం కూడా.
ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలో ఉన్న కూటమి పార్టీ కి చెందిన ఓటర్లు ఎవరూ కూడా విజయసాయి రెడ్డి వైపు కానీ...ఆయన పెట్టే కొత్త పార్టీ వైపు కానీ చూసే అవకాశాలు దాదాపు అసాధ్యం అని చెప్పొచ్చు. ఉంటే గింటే తమ నేతలతో సన్నిహితంగా ఉన్నారన్న కారణంగా బీజేపీ క్యాడర్ కు ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉండొచ్చు విజయసాయి రెడ్డి విషయంలో. కాకపోతే ఇప్పటికిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీకి ఉన్న బలమే అత్యంత పరిమితం అన్న విషయం తెలిసిందే. ఎలా చూసుకున్నా కూడా విజయసాయిరెడ్డి కొత్తగా పెట్టబోయే పార్టీ వల్ల నష్టం ఉంటే అది ఒక్క వైసీపీ కి మాత్రమే అన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. మరో వైపు మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత రెండేళ్ల నుంచి కనీసం అసెంబ్లీ కూడా హాజరు కాకుండా వైసీపీ తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కుంటోంది. విజయసాయి రెడ్డి పెట్టబోయే పార్టీకి వెళ్లే నాయకుల్లో కూడా ఎక్కువ శాతం వైసీపీ నుంచే ఉంటారు అని చెపుతున్నారు. విజయసాయిరెడ్డి పెట్టబోయే పార్టీ ఏపీలో ఎంత మేర ప్రభావం చూపిస్తుందో.