తొలిసారి మంత్రి పదవి చేపట్టిన విడదల రజనీకి జగన్ సర్కారు అత్యంత కీలకమైన వైద్య ఆరోగ్య శాఖను కట్టబెట్టింది. ఇప్పుడు ఆమెను అత్యంత కీలకమైన విశాఖపట్నం జిల్లాకు ఇన్ ఛార్జి మంత్రిగా నియమించారు. దీంతో ప్రభుత్వంలో ఆమెకు ఎక్కడలేని ప్రాధాన్యత ఉందనే విషయం అర్ధం అవుతుందనే చర్చ సాగుతోంది. వైజాగ్ ను జగన్ సర్కారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా డెవలప్ చేయాలనే యోచనలో ఉన్న విషయం తెలిసిందే. పర్యాటక శాఖమంత్రి రోజాకు కృష్ణా జిల్లా బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు ఇన్ ఛార్జి మంత్రులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
ధర్మాన ప్రసాదరావుకు గుంటూరు, సీదిరి అప్పలరాజుకు కాకినాడ, బొత్స సత్యనారాయణకు శ్రీకాకుళం, రాజన్నదొరకు అనకాపల్లి, గుడివాడ అమర్ నాధ్ కు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, బూడి ముత్యాలనాయుడికి విజయనగరం, దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)కు పశ్చిమ గోదావరి, పినిప విశ్వరూప్ కు ఏలూరు, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల క్రిష్ణకు తూర్పు గోదావరి, తానేటి వనితకు ఎన్టీఆర్, కారుమూరి వెంకటేశ్వరరావుకు పల్నాడు, కొట్టు సత్యనారాయణకు బాపట్ల, జోగి రమేష్ కు అమలాపురం, మేరుగ నాగార్జునకు ఒంగోలు, అంబటి రాంబాబుకు నెల్లూరు, అదిమూలపు సురేష్ కు కడప జిల్లా ఇన్ ఛార్జి మంత్రులుగా నియమించారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి అన్నమయ్య జిల్లా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనంతపురం, నారాయణస్వామికి తిరుపతి, అంజాద్ బాషాకు నంద్యాల, బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డికి కర్నూలు, గుమ్మనూరు జయరామ్ కు సత్యసాయి, కె వి ఉషశ్రీ చరణ్ కు చిత్తూరు జిల్లా బాధ్యతలు కేటాయించారు.