తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన హత్యకు కొంత మంది రెక్కీ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వాళ్ళు ఎవరో త్వరలో వెల్లడిస్తానన్నారు. ఆదివారం నాడు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరించారు. ఈ సందర్భంగా రాధా మట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని, వంగవీటి రంగా కీర్తి, ఆశయాల సాధనే తన లక్ష్యమన్నారు. పదవులు కాదని, తాను దేనికీ భయపడను అని రాధా ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు. వంగవీటి రాధాపై మంత్రొ కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధా తనకు తమ్ముడని, తాను వైసీపీలో ఉన్నానని, రాధ టీడీపీలో ఉన్నాడు అనుకుంటా? అని అన్నారు. కల్మషం లేని రాధ తాను నమ్మిన దారిలోనే నడుస్తున్నాడని నాని తెలిపారు. వంగవీటి రాధకు అభిమానులు అండగా నిలవాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోరారు. వంగవీటి రాధా, మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు భేటీ కావటం కూడా రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.