ఉగాది నుంచి తిరుమలలో అన్ని ఆర్జిత సేవలు

Update: 2021-02-27 12:46 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఉగాది నుంచి కరోనా కారణంగా ఆగిపోయిన అన్ని ఆర్జిత సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా. వేసవిలో ఈ కేసులు మరింత తగ్గే అవకాశం ఉందనే అంచనాల మధ్య ఆర్జిత సేవల పునరుద్ధరణకు నిర్ణయం తీసుకున్నట్లు కన్పిస్తోంది. దీంతోపాటు టీటీడీ ఉద్యోగులు అందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎంపిక చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో మార్చి 1 నుంచి వ్యాక్సినేషన్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుమలలో శనివారం నాడు టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రథ సప్తమి రోజు లక్ష మంది భక్తులకు వాహన సేవలు వీక్షించే భాగ్యం కల్పించామని పేర్కొన్నారు. 2021-22 సంవత్సరానికి రూ.2937 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించినట్లు వెల్లడించారు. ఏప్రిల్ 14న ఉగాది నాటి నుంచి భక్తులను శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత సేవలకు అనుమతిస్తున్నట్లు తెలిపారు.

తిరుపతిలోని బర్డ్‌ లో చిన్న పిల్లల ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి రూ.9 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నెయ్యి ధరలు పెరుగుతుండటంతో నిల్వ సామర్థ్యం పెంచాలని సూచించారు. తిరుమలలో పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ పవర్ వినియోగించాలని పేర్కొన్నారు. తిరుమలలోని రెస్ట్ హౌస్‌లు, సత్రాలు, కాటేజీల్లో విద్యుత్ వృథాను నియంత్రించడానికి ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అయోధ్యలో టీటీడీ నిర్మాణాలు చేపట్టి సేవా కార్యాక్రమాలు నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వాన్ని భూమి కేటాయించాలని కోరినట్లు పేర్కొన్నారు. శ్రీవారి మెట్టు మార్గంలో అన్నదానం చేయాలని బోర్డు నిర్ణయించినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News