తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు మంగళవారం నాడు తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించటంతో తాజాగా మళ్ళీ రమణదీక్షితులు టీటీడీ ప్రధాన అర్చకులుగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వంగా సీఎం జగన్ తో భేటీ అయ్యారు. సీఎంను కలసిన అనంతరం రమణదీక్షితులు మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ విష్ణుమూర్తిలా ధర్మాన్ని రక్షిస్తున్నారని వ్యాఖ్యానించారు.
అదే సమయంలో అర్చకుల కుటుంబాలకు భూములు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పింక్ డైమండ్ అంశం కోర్టులో ఉన్నందున దానిపై ఏమీ మాట్లాడనన్నారు. టీటీడీలో అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయనటంలో ఏ మాత్రం వాస్తవంలేదని రమణదీక్షితులు తెలిపారు. టీటీడీ అంశాలను రాజకీయం చేయటం తగదన్నారు.