ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షమాపణ డిమాండ్ నెరవేరింది. శుక్రవారం నాడు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం అనంతరం పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత క్షమాపణ డిమాండ్ పై స్పందించని చైర్మన్ బిఆర్ నాయుడు కొద్ది గంటల్లోనే బోర్డు సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో టీటీడీ తప్పిదం లేకపోయినప్పటికీ పాలకమండలి తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో అన్ని విషయాలను అధికారులకు వదిలేయకుండా జాగ్రత్త పడతామని ఆయన తెలిపారు.
తొక్కిసలాట ఘటనలో ఆరుగురు మృతిచెందడం, పలువురికి గాయాలు కావడం దురదృష్టకరమని అన్నారు. కొందరు అధికారుల అత్యుత్సాహం వల్ల జరిగిన ఘటన ఇది. అధికారులు క్షమాపణ చెప్పాలా లేదా అన్నది వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నాం. తాము వెళ్లి వాళ్ళను క్షమాపణ చెప్పాలని కోరలేము అన్నారు. టీటీడీకి బోర్డే సుప్రీం అని.... సీఎం చంద్రబాబు ఈ విషయాన్ని అధికారుల ముందే స్పష్టం చేసారు అని చెప్పారు. పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అధికారులు అమలు చేయాలి. ముఖ్యమంత్రి దృష్టికీ ప్రతి సమస్యను తీసుకెళ్తున్నామని తెలిపారు.