తిరుమలను గ్రీన్ జోన్‌గా ప్రకటిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ వై వీ సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తిరుమలకు 100 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని, భవిష్యత్తులో తిరుమలకు కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని వెల్లడించారు. శనివారం నాడు తిరుమలలో తిరుమల తిరుపతి (టీటీడీ) బోర్డు సమావేశం జరిగింది.. సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ నెలలోపు టీటీడీలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేయడానికి కమిటీని ఏర్పాటు చేశామని చెప్పారు. తిరుమలలోని అనధికారిక దుకాణాలను వారం రోజుల్లో తొలగిస్తామన్నారు. చిన్నపిల్లల ఆస్పత్రికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాల్లోటీటీడీ కల్యాణ మండపాలను నిర్మిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కాశ్మీర్‌లో 18 నెలల్లో శ్రీవారి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. కొత్తగా శ్రీవారి ట్రస్ట్ నిధులతో 500 శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపడతామని వెల్లడించారు.
అదేవిధంగా వారణాసి, ముంబైలోనూ శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. గుడికో గోమాత కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు. గత రెండేళ్లలో అనేక నిర్ణయాలు తీసుకున్నామని, సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా ఎల్1 దర్శనాలు రద్దు చేశామని తెలిపారు. తిరుమలలో ప్లాస్టిక్ బ్యాన్ చేశామని, కరోనా సమయంలో ప్రజలు త్వరగా కోలుకోవాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. ధర్మప్రచారంలో భాగంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆలయాలు నిర్మిస్తున్నామని చెప్పారు. వరహస్వామి ఆలయానికి బంగారు తాపడం, వాకిలికి వెండి తాపడం పనులు చెస్తున్నామని తెలిపారు. స్వామివారికి గోవు ఆధారిత వ్యవసాయంతో పండించిన బియ్యంతో నైవేధ్యం సమర్పిస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.